కరోనా మహమ్మారి రెండేళ్లుగా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కోట్ల ప్రాణాలను బలితీసుకుంది. ఇప్పటికీ కోట్ల మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాల కోసం ఆసుపత్రుల్లో పోరాడుతున్నారు. ఇక ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో కొంత పరిస్థితి మెరుగుపడినా.. భారత్ విషయంలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. రోజూ లక్షల కేసులు, వేల మరణాలు నమోదువుతున్నాయి. అయితే గతేడాది కరోనా మొదటి దశలో దారుణంగా దెబ్బతిన్న దేశం అగ్రరాజ్యం అమెరికా. ఈ క్రమంలోనే ఎలాగైనా కరోనా మూలాలను కనిపెట్టాలని అమెరికా కొత్త ప్రెసిడెంట్ బైడెన్ పట్టుబట్టి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన అధికారులకు కీల ఆదేశాలు జారీ చేశారు. కరోనా పుట్టుకను కనుగొనే ప్రయత్నాలను వేగవంతం చేసి, 90 రోజుల్లోగా పూర్తి నివేదిక అందించాలని నిఘా విభాగాలను ఆదేశించారు. వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే పలువురు పరిశోధకులు 2019 నవంబర్‌లో అనారోగ్యం పాలై, ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు ఇటీవల అమెరికా ప్రభుత్వ నిఘా నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బైడెన్ ఈ ఆదేశాలివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘నిఘా వర్గాల ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు జాతీయ పరిశోధన శాలలు, ఇతర ప్రభుత్వ విభాగాలు కూడా తోడుగా నిలవాలని కోరాను. చైనా నుంచి సమాధానం రావాల్సిన కొన్ని నిర్దిష్ట ప్రశ్నలతోపాటు తదుపరి విచారణ చేపట్టాల్సిన అంశాలను కూడా ఆ నివేదికలో పొందుపరచాలని సూచించాను’అని బైడెన్ అధికారికంగా ప్రకటించారు. పారదర్శకంగా, సాక్ష్యాల ఆధారంగా సాగే అంతర్జాతీయ విచారణకు సహకరించి, అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని, ఆధారాలను అందించేలా చైనాపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు భావసారూప్యం గల దేశాలతో కలిసి పనిచేస్తామని బైడెన్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే కరోనా పుట్టుక చైనాలోనే జరిగిందని, 2019 నవంబరులోనే ఊహాన్ సైంటిస్టులు కరోనా బారిన పడ్డారనే అమెరికా వాదనను చైనా ఖండించింది. ‘నిజాలను, వాస్తవాలను అమెరికా అంగీకరించదు. మూలాలపై శాస్త్రీయత ఆధారంగా చేసిన అధ్యయనంపై ఆ దేశానికి నమ్మకమే లేదు’అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ పేర్కొన్నారు. తమకు కళంకాన్ని ఆపాదించేందుకు, నిందలు వేసేందుకు ఈ మహమ్మారిని అవకాశంగా వాడుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని లిజియాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఒకవేళ అమెరికా నిఘా వర్గాల పరిశోధనల్లో వూహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టిందని తేలితే అప్పుడు అమెరికా ఏం చేస్తుందో చూడాలి. అలాగే దానిని చైనా ఎలా ఎదుర్కొంటుందో కూడా చూడాలి.