రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చెన్నైకుఒంటి చేత్తో గెలుపునందించాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింటిలోనూ సూపర్ పెర్ఫార్మెన్స్‌తో ఆర్సీబీ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. దీంతో మ్యాచ్ అనంతరం జడేజాపై ధోనీ ప్రశంసల వర్షం కురిపించాడు. జడేజా ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాలను మార్చగలడని, ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడని కొనియాడాడు. ‘అవకాశం వచ్చినప్పుడే ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవాలి. జడేజా అదే చేశాడు. అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడ’ని ధోనీ అన్నాడు.
తమ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో జడేజా సాధించిన అదనపు పరుగులు జట్టుకు ఉపయోగమని చెప్పొచ్చని 160-170 స్కోర్ సాధించాలనుకుంటే అదనంగా 20-25 పరుగులు వచ్చాయని ధోనీ అన్నాడు. దాంతో ఛేదనలో బెంగళూరు మరింత ధాటిగా ఆడాల్సిన అవసరం వచ్చిందని, ఈ క్రమంలోనే ఆ జట్టును మొదట్లోనే కోహ్లీ, పడిక్కల్‌లను అవుట్ చేసి దెబ్బ కొట్టడం, మధ్యలో పరుగులు చేయనివ్వకుండా ఆపడంతో పాటు వికెట్లు పడగొట్టడంతో విజయం సొంతమైందని ధోనీ అన్నాడు.
గతేడాదితో పోలిస్తే తమ ఆటలో ఎలాంటి మార్పులేదని, గెలిచినా ఓడినా తాము ఒకటే పద్ధతి పాటిస్తామని ఎంఎస్‌డీ అన్నాడు. ఫలితం గురించి కాకుండా ఆడాల్సిన పద్ధతి మీద దృష్టి సారిస్తామని చెప్పాడు. ఓటములు ఎదురైనప్పుడే వ్యక్తిత్వానికి అసలు పరీక్ష ఎదురవుతుందని, అప్పుడే మరింత ఎక్కువ గౌరవం లభిస్తుందని ధోనీ అన్నాడు. అలాగే మాటల కన్నా చేతలే ఎక్కువ ప్రభావం చూపుతాయనే సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని, అదే తమ ఆటగాళ్లకు నమ్మకం కలిగించిందని చెప్పాడు. అయితే గతేడాది పేలవ ప్రదర్శన చేసి ఇక్కడికి రావడంతో తొలి మ్యాచ్‌లో ఓటమి ఆటగాళ్లపై ఒత్తిడి తెచ్చిందని ధోనీ వివరించాడు. కానీ ఆ తర్వాత అద్భుతంగా కోలుకున్నామన్నాడు.
మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందనేది ముందే అంచనా వేయలేమని, ఆర్సీబీతో మ్యాచ్‌లో తొలుత తాము కూడా బ్యాటింగ్ చేయాలా, బౌలింగ్ చేయాలా అనే విషయంపై సందిగ్ధంలో పడ్డామని ధోనీ చెప్పాడు. తమ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై పై చేయి సాధించారని ప్రశంసించాడు.
కాగా, ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో జడేజా (62*; 28 బంతుల్లో 4×4, 5×6) చివరి ఓవర్‌లో ఐదు సిక్సులు, ఒక బౌండరీ, ఒక డబుల్‌తో పాటు నోబాల్ పడటంతో మొత్తం 37 పరుగులు సాధించాడు. దాంతో చెన్నై 20 ఓవర్లకు 191/4 స్కోర్ సాధించింది. ఆపై బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేసి సీజన్లో తొలి ఓటమిని చవి చూసింది.