ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఆదివారం రాత్రి చెన్నైలో జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్‌పై సూపర్ ఓవర్లో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత హైదరాబాద్, ఢిల్లీ జట్లు నిర్ణీత 20 ఓవర్లలో సరిసమానంగా 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ సీజన్‌లో తొలిసారి సూపర్ ఓవర్ వరకు వెళ్లిన తొలి మ్యాచ్ కావడంతో అభిమానులకు అదనపు ఆనందాన్ని పంచిందీ మ్యాచ్. అయితే సూపర్ ఓవర్లో హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అతితెలివితో వ్యవహరించి ఓటమి మూటగట్టుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠ విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో కేన్ విలియమ్సన్‌తో కలిసి బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ఓవర్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో ఢిల్లీ 8 పరుగులును సునాయాసంగా కొట్టి విజయం సాధించింది.
అయితే జానీ బెయిర్‌స్టో లాంటి పవర్ హిట్టర్ ఉండగా.. కేన్ విలియమ్సన్‌తో కలిసి డేవిడ్ వార్నర్ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కి దిగడంపై సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వార్నర్ ప్లానింగ్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వార్నర్ తప్పిదం కారణంగానే సూపర్ ఓవర్లో ఢిల్లీ గెలిచిందంటూ ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ కూడా చేరింది. “వార్నర్ అన్నా ఏందిది..? ఎందుకు నువ్వు వచ్చావ్ ? బెయిర్ స్టోని లేదా సుచిత్ ను పంపొచ్చుగా..నీకు టీమ్ నిర్మించుకోవాలనుకుంటే డ్రీమ్ లెవెన్ లో ఆ పని చెయ్యి ” అంటూ ఈషా ట్వీట్ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే సూపర్ ఓవర్లో వార్నర్ మూడు బంతులు ఎదుర్కోగా.. రెండు పరుగులు మాత్రమే చేశాడు. చివరి బంతికి వార్నర్ రెండు పరుగులు చేసినా.. రన్నింగ్ సమయంలో వార్నర్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో క్రీజు లోపల బ్యాట్ సరిగ్గా పెట్టకపోవడంతో షార్ట్ రన్‌గా అంపైర్ నిర్ణయించాడు. దీంతో ఒక పరుగు మాత్రమే కౌంట్ చేశారు. దాంతో ఢిల్లీ టార్గెట్ 8 పరుగులుగా నిర్ణయించారు. ఇక సూపర్ ఓవర్‌లో రషీద్ ఖాన్ బాగానే బౌలింగ్ చేసినా.. ఓవర్ మూడో బంతిని ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఫోర్‌గా మలచడంతో ఆ జట్టు విజయానికి చేరువైంది. చివరి రెండు బంతుల్లో రెండు సింగిల్స్ రావడంతో ఢిల్లీ విజయం సాధించింది. ఒకవేళ షార్ట్ రన్ పరుగు కూడా ఉండుంటే.. మ్యాచ్ మరో సూపర్ ఓవర్‌కి వెళ్లేది. అప్పుడు హైదరాబాద్ గెలిచే అవకాశం ఉండేది.