Thursday, November 21, 2024

కోహ్లీ అందడమే లేదే..? వార్నర్ పోస్ట్

టీమిండియా తరపున 254 వన్డేల్లో 12169 పరుగులు, 91 టెస్టుల్లో 7490 పరుగులు, 89 టీ20ల్లో 3159 పరుగులు సాధించాడు. ఇక టీ20ల్లో ఇప్పటివరకు సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయినా అర్థ సెంచరీలు మాత్రం 28 సాధించాడు. వన్డేల్లో 43, టెస్టుల్లో 27 సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. ఓవరాల్‌గా 70 సెంచరీలతో ప్రపంచ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆల్ టైం లిస్ట్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ కంటే ముందు టీమిండియా లెజెండ్ సచిన్‌(100 సెంచరీలు), పాంటింగ్‌(71 సెంచరీలు) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. వీరిద్దరూ ఆటకు గుడ్ బై చెప్పడంతో ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో కోహ్లీనే టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీపై ఆసీస్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా కోహ్లీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడని, అతడిని అందుకోవడం కష్టంగా ఉందని వార్నర్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

ఇటీవల ఐపీఎల్ 14వ సీజన్ అర్థాంతరంగా ముగియడంతో ఆసీస్ ఆటగాళ్లంతా స్వదేశానికి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే భారత్‌లో ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆటగాళ్లంతా అక్కడ ఐసోలేషన్‌లో ఉన్నారు. వార్రర్ కూడా వారితో పాటు ఐసోలేషన్లో ఉన్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా ప్రపంచ క్రికెట్లో ఇప్పటికీ కొనసాగుతూ అత్యధిక సెంచరీలు చేసిన టాప్ 10 ఆటగాళ్ల లిస్ట్‌ను వార్నర్ షేర్ చేశాడు. ఈ పోస్ట్‌లో ”లిస్ట్‌లో ఉన్న వాళ్లంతా ఇంకా క్రికెట్‌ ఆడుతున్నారు. ఎవరు రిటైర్‌ కాలేదు.. ఒకసారి పరిశీలించండి” అంటూ వార్నర్‌ రాసుకొచ్చాడు. అలాగే అందరికంటే అత్యధిక సెంచరీలు(70)తో టాప్ ప్లేస్‌లో ఉన్న కోహ్లీ పేరును మార్క్ చేసి.. ”ఇదిగో ఈ వ్యక్తిని అందుకోవడం మాకు కష్టంగా ఉంది.. మాకు అందనంత దూరంలో ఉన్నాడు. ఈ మిషన్‌గన్‌ను ఆపడం ఎలా” అంటూ ఫన్నీ క్యాప్షన్‌ జత చేశాడు.

కాగా.. ఈ లిస్ట్‌లో కోహ్లీ 70 సెంచరీలతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. రెండో స్థానంలో వార్నర్‌(43), క్రిస్‌ గేల్‌(42 సెంచరీలతో మూడో స్థానం), రోహిత్‌ శర్మ(40 సెంచరీలతో నాలుగో స్థానం), రాస్‌ టేలర్‌(40 సెంచరీలతో ఐదో స్థానం)లో ఉన్నారు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్‌, కేన్ విలిమమ్సన్‌, జో రూట్‌, ధావన్‌, డుప్లెసిస్‌లు ఉన్నారు.

ఇదిలా ఉంటే కోహ్లీ మాత్రం 2019 నుంచి ఒక్క ఫార్మాట్‌లోనూ సెంచరీ ఫీట్‌ను సాధించలేకపోయాడు. 2019 ఆగస్టులో విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండుసార్లు సెంచరీ మార్క్‌ను అందుకున్న కోహ్లి ఆ తర్వాత మాత్రం ఒక్కసారి కూడా శతకాన్ని అందుకోలేకపోయాడు. కరోనా ఎఫెక్ట్‌ కారణంగా 2020లో మ్యాచ్‌లు ఆడే అవకాశం ఎక్కువగా రాకపోవడం.. ఆ తర్వాత జరిగిన ఆసీస్‌, ఇంగ్లండ్‌ సిరీస్‌ల్లోనూ సెంచరీని అందుకోలేకపోయాడు. అయితే తాజాగా ఇంగ్లండ్ వేదికగా కివీస్‌తో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో కానీ, లేదా ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరగబోయే 5 టెస్ట్‌ల సిరీస్‌లో కానీ సెంచరీ అందుకుంటాడేమో చూడాలి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x