ఇటీవల ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అటు ఉద్యోగార్థులు, ఇటు రాజకీయ నాయకులు ఈ క్యాలెండర్‌పై నిప్పులు చెరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి జాబ్ లెస్ క్యాలెండర్ ఎంతో ఆర్భాటంగా ప్రకటించి అందరినీ మోసం చేశారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ విమర్శించారు. శనివారం ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కు నిరసనగా జనసేన ఆందోళనకు దిగింది. ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమంలో నిరుద్యోగులతో పాటు మహేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్‌తో జగన్‌రెడ్డి అందరినీ మోసం చేశారని మండిపడ్డారు. లక్షల మంది నిరుద్యోగుల ఆశలను నీరుగార్చారని చెప్పారు. నిరుద్యోగులు రోడ్డెక్కి రోధిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించి ప్రభుత్వ శాఖల్లోని పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేసే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పోతిన మహేష్ స్పష్టం చేశారు.
అలాగే దేవదాయశాఖ కూడా దారుణంగా పనిచేస్తోందని, పనికిమాలిన చేతకాని దద్దమ్మ దేవదాయశాఖ మంత్రిగా ఉన్నారని విమర్శించారు. ఆలయాల సోమ్ము దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని జనసైనికులు నిలదీసినా, వైఫల్యాలను ప్రశ్నించినా తట్టుకోలేకపోతున్నారని, దాడులు చేస్తూ ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇటీవల జనసేనపై విమర్శలు చేసిన వెల్లంపల్లి గురించి మాట్లాడుతూ.. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఆయనకు జనసేన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.