జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ ఎందుకు సినిమాలు చేస్తున్నారు..? అంటూ అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్న విషయం విదితమే. అంతేకాదు.. ఒకానొక సందర్భంలో పవన్ కూడా.. రాజకీయాలకే నా జీవితం.. ప్రజలతో ఉంటాను.. ఇక సినిమాలకు స్వస్తి చెప్పేసి ప్రజలతోనే మమేకమై ఉంటా.. అని అప్పట్లో బల్లగుద్ది మరీ చెప్పారు. అంతేకాదు ఆయన సోదరుడు నాగబాబు కూడా ఇదే విషయాన్ని బహిరంగ సభల్లో, యూట్యూబ్ చానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు.
అయితే.. మళ్లీ ‘వకీల్ సాబ్’ సినిమాతో పవన్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే.. ఈ రీఎంట్రీపై.. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా లోక్‌సభ స్థానం అభ్యర్థి రత్నప్రభ తరఫున పవన్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. తాను అసలు తాను మళ్లీ ఎందుకు సినిమాలు చేయాల్సి వచ్చింది..? అనే విషయంపై కూడా పవన్ క్లారిటీ ఇచ్చుకున్నారు.
సినిమాల్లోకి రీఎంట్రీపై..
రాజకీయాల కోసం మూడేళ్లు సినిమాలను పక్కనబెట్టాను. నాకు సినిమాలు మాత్రమే తెలుసు. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తున్నా.. కోట్ల రూపాయిలు పన్నులు కట్టాను.. కడుతున్నాను. నాపై విమర్శలు చేస్తున్నవారిలా నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పేకాట క్లబ్బులు లేవు. ఈ రాజకీయ నాయకులకు ఎక్కడ్నించి డబ్బులు వస్తున్నాయి?. ఎవడబ్బ సొమ్ము అని విచ్చలవిడిగా వెదజల్లుతున్నారు? పిడికెడు రాగిసంగటి తిని బతుకుతానే తప్ప అడ్డదారులు తొక్కను.
ప్రత్యర్థులకు ఓట్లేస్తే పథకాలు తీసేస్తాం అని బెదిరించేందుకా మీకు అధికారం ఇచ్చింది? సామాన్యులపైనా మీ ప్రతాపం…. దమ్ముంటే మీ ప్రతాపం పవన్ కల్యాణ్ పై చూపండి! మీరు ఎలాంటి గొడవ పెట్టుకుంటారో పెట్టుకోండి…ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నా… దేనికైనా సై. వైసీపీ నాయకులకు ఇదే నా సవాల్!’ అని పవన్ ఛాలెంజ్ చేశారు. మరీ ఈ సవాళ్లపై రేపో.. మాపో వైసీపీ మంత్రులు, నేతలు.. ముఖ్యంగా తిరుపతి వైసీపీ అభ్యర్థి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.