ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైసీపీకి.. నాటి నుంచి నేటి వరకూ ఏ ఎన్నికలు జరిగినా ఆ పార్టీ ఖాతాలోకే వెళ్తున్నాయి. ఈ మధ్యే జరిగిన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏ రేంజ్‌లో గెలిచిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. అసెంబ్లీ ఎన్నికల నుంచి నిన్న మొన్న జరిగిన ఎన్నికల వరకూ ఘోర పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీ.. పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని.. దానికి ఎన్నెన్నో కారణాలు, వివరణలు ఇచ్చుకుంది. కాగా.. దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల అన్నగారు టీడీపీని స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకూ అన్ని ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తోంది. అయితే మొదటిసారిగా ఇలా పరిషత్ ఎన్నికలకు ఆ పార్టీ దూరంగా ఉంటోంది.. టీడీపీ చరిత్రలోనే ఇదే మొదటిసారి. అయితే.. దీనిపై అటు మీడియాలో.. ఇటు వైసీపీ నేతలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. శనివారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
పీఠం కదిలిపోయి.. జెండా పీకేయడానికి..
‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధాటికి తెలుగుదేశం పార్టీ పీఠం కదిలిపోయి.. జెండా పీకేయడానికి సిద్ధంగా ఉంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు ఏకపక్ష ఫలితాలను సీఎం వైయస్ జగన్‌కు ప్రజలు అందించారు. రాష్ట్రం మొత్తం వైసీపీ ప్రభంజనం కొనసాగుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతాడని తెలిసే చంద్రబాబు జెండా ఎత్తేశారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉంది. నూతన ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారన్నారు. మొన్నటి వరకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఏరకంగా ప్రవర్తించారో రాష్ట్రమంతా చూసింది. ప్రజాస్వామ్యం ఉందో లేదో.. నిమ్మగడ్డ ఎన్నికలు ఆపేసినప్పుడే ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎన్నికలు ఎక్కడ ఆగిపోయాయో.. అక్కడి నుంచే మొదలుపెట్టాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.. కోర్టు ఆదేశాలనే నూతన కమిషనర్ ఫాలో అవుతున్నారు. పరిషత్ ఎన్నికల్లో ఓటమి తప్పదని చంద్రబాబు తెలుసు. టీడీపీ ఒదిలేసింది కాబట్టే వైసీపీ గెలిచిందని చెప్పుకోవడానికే బహిష్కరణ డ్రామా ఆడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో 37 శాతం గెలిచామని తోకపత్రికల్లో రాయించుకొని, లోకేష్ ప్రెస్‌మీట్లు చెప్పుకున్నప్పుడు.. పరిషత్ ఎన్నికలకు బాబు ఎందుకు భయపడుతున్నారు. 37 శాతం పంచాయతీలు గెలిస్తే.. 37 శాతం ఎంపీటీసీలు కూడా గెలుస్తారు కదా..?’ అని మంత్రి కురసాల కన్నబాబు చురకంటించారు.
లోకేష్ వ్యతిరేకిస్తున్నారా..?
‘పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కొడుకు లోకేష్ వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చంద్రబాబు ప్రకటించిన తరువాత మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలానికి చెందిన టీడీపీ నేతలు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెప్పడం వెనకున్న కారణం ఏంటి..?. తండ్రి చంద్రబాబు ఎన్నికలు బహిష్కరించిన తర్వాత.. కొడుకు నారా లోకేష్ ఆదేశాలు లేకుండా దుగ్గిరాల మండల టీడీపీ శాఖ ఎలా నిర్ణయం తీసుకుంటుంది..?. చంద్రబాబు నిర్ణయాన్ని లోకేష్ వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఎమ్మెల్యే ఆర్కే తీవ్ర విమర్శలు గుప్పించారు. మొత్తానికి చూస్తే.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పరిషత్ ఎన్నికలకు వెనకడుగు ఎందుకేస్తున్నారో.. అసలు దీని వెనుక కథేంటో..? బాబు.. ఆ పార్టీ నేతలకే ఎరక.