ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేయడం, జులై 31లోగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో అది సాధ్యం కాదని భావించిన ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. పరీక్షలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. టెన్త్, ఇంటర్ పరీక్షలపై సీఎం నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే విద్యార్థుల ఉత్తీర్ణతకు సంబంధించి హైపవర్ కమిటీ వేస్తున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు.
అంతే కాకుండా ఇతర బోర్డు పరీక్షలు రద్దుతో ఏపీ విద్యార్థులకు నష్టం జరగదన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా పరీక్షల నిర్వహణ అసాధ్యమని తెలిపారు. సుప్రీంకోర్టు చెప్పినట్లు జులై 31లోగా ఫలితాలు ప్రకటించడం సాధ్యంకాదని, అందుకే పరీక్షల రద్దుకే మొగ్గు చూపామని మంత్రి సురేశ్ వెల్లడించారు.
కాగా కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షాలు ఏపాపటినుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అటు విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే 21 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేయడం కూడా ఏపీ సర్కారు పై ఒత్తిడి పెంచింది. దీంతో ఎట్టకేలకు పరీక్షల రద్దుకు జగన్ ప్రభుత్వం కూడా మొగ్గు చూపింది.
అంతకుముందు ఇంటర్ పరీక్షలపై సీఎం నేతృత్వంలో ఉన్నతస్థాయి భేటీ అయింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్‌ని సీఎం కార్యాలయానికి పిలిపించారు. దీంతో మంత్రి సురేష్ విజయవాడకు చేరుకున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను సీఎంకు ఉన్నతాధికారులు వివరించారు. ఈ క్రమంలోనే జగన్ పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నారు.