కోవిడ్ నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పన్నెండో తరగతి విద్యార్థులను పాస్ చేసేందుకు సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈ ఓ విధానాన్ని ప్రతిపాఫించాయి. ఈ విధానాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. విద్యార్థులు భౌతికంగా హాజరై పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని తల్లిదండ్రుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
పన్నెండో తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి వెకేషన్ బెంచ్ మంగళవారం దీనిపై విచారణ జరిపింది. సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈ ప్రతిపాదించిన విధానం సమంజసంగా, న్యాయంగా ఉందని, ఈ విధానంలో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ‘విద్యా రంగంలోని నిపుణులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదనలు చేశారు. ఎవరికీ ప్రతికూలత లేకుండా పరిపూర్ణ స్థాయిలో ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. దీనిపై రెండో ఆలోచనకు తావు లేదు’ అని పేర్కొంది.
అత్యధికామంది ప్రజలకు మంచి జరిగేలా ఈ ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపింది. అలాగే కంపార్ట్‌మెంట్ పరీక్షలను ఆగస్టు 15-సెప్టెంబరు 15 మధ్యలో నిర్వహించేందుకు సీబీఎస్ఈ చేసిన ప్రతిపాదనను ఆమోదించింది.