జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్.. ఈ రెండు పార్టీలో ఒకదానికి మరొకటి ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి. ఓ పార్టీ గెలిస్తే మరో పార్టీ ప్రతిపక్షంలో ఉండడం, రెండో సారి ఈ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొన్నేళ్లుగా థర్డ్ ఫ్రంట్ అనే మాట బాగా వినిపిస్తోంది. రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర పార్టీలన్నీ కలిసి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. థర్డ్ ఫ్రంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే సత్తా థర్డ్ ఫ్రంట్‌కు లేదని, అలాంటి శక్తివంతమైన ఓ ఫ్రంట్ ఏర్పడుతుందని కూడా తనకు నమ్మకం లేదని పీకే అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్.. ‘భారతీయ జనతా పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు మూడో ఫ్రంట్ కానీ, నాలుగో ఫ్రంట్ కానీ వస్తుందనే నమ్మకం నాకు లేదు. ప్రస్తుత ప్రభుత్వాన్ని విజయవంతంగా సవాల్ చేయగలిగే థర్డ్ లేదా ఫోర్త్ ఫ్రంట్ వస్తుందని నేననుకోవడం లేదు. అందుకే థర్డ్ ఫ్రంట్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయడంపై ప్రస్తుతం ఎలాంటి ఆలోచనా చేయడం లేదు’ అని పీకే చెప్పారు.
థర్డ్ ఫ్రంట్ ప్రయోగం గతంలో జరిగిందని, దీనికి పరీక్షలు ఎదురయ్యాయని, ఇది పాతబడిపోయిందని అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు థర్డ్ ఫ్రంట్ తగినది కాదన్నారు. శరద్ పవార్‌తో తాను తీవ్రమైన రాజకీయ చర్చలు జరిగినట్లు తెలిపారు. బీజేపీపై పోరాటానికి చేయవలసినదేమిటో రాష్ట్రాలవారీగా చర్చించినట్లు తెలిపారు.
ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ప్రశాంత్ కిశోర్ వరుస భేటీలు జరుపుతుండటంతోపాటు కొందరు ప్రతిపక్ష నేతలు కూడా మంగళవారం సమావేశమయ్యారు. శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్‌సీపీ, ఏఏపీ, టీఎంసీ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్‌డీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలతోపాటు కొందరు పాత్రికేయులు, ఇతర రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.