తలతెగిపడ్డా తన అడుగు వెనక్కిపడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. శనివారం రాత్రి తిరుపతి లోక్‌సభ స్థానం అభ్యర్థి రత్నప్రభ తరఫున పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తిరుపతి శంకరంబాడి కూడలి వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన వాడీవేడిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ.. అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోశారు. అయితే.. ఒకప్పుడు తాను కలిసి పోటీ చేసిన జనసేనను కానీ.. అటు దేశ వ్యాప్తంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న బీజేపీ గురించి కానీ పవన్ పొల్లెత్తి మాట కూడా అనలేదు. అంతేకాదు.. ఈ సందర్భంగా యువత గురించి మాట్లాడిన పవన్ తన అసంతృప్తి ఈ సభా వేదికగా వెల్లగక్కారు.
‘యువత తాజా పరిణామాల పట్ల వెనుకంజ వేస్తున్న తీరు నాకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. నేను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా యువత రోడ్లపైకి పోటెత్తుతుంది.. కానీ ఎన్నికల వద్దకు వచ్చేసరికి అదే యువత భయపడుతుంటుంది. ఒక ఎమ్మెల్యే బెదిరిస్తే భయపడిపోతారా… ఏం పౌరుషం లేదా మీలో? ఆత్మగౌరవం లేని బతుకులా మనవి? భయపడితే చచ్చిపోతాం తప్ప ముందుకెళ్లం. శ్రీశ్రీ చెప్పినట్టు పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప’ అంటూ యూత్‌పై ఓ వైపు తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కుతూ మరోవైపు ఇలా రెచ్చగొట్టినట్లుగా పవన్ మాట్లాడారు.
ఏంటిది సేనానీ..!
జనసేనాని వ్యాఖ్యలపై సొంత పార్టీ కార్యకర్తలు, వీరాభిమానులు, బీజేపీ యువత కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది. అంతేకాదు.. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే.. ఇదే తిరుపతి వేదికగా ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా పవన్ చేయగలడా..? ఇలాంటివన్నీ మానేసి యూత్‌ను ప్రశ్నించి.. వారిపై అసంతృప్తి వెల్లగక్కడమేంటి..? అని విమర్శకులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా తిరుపతి బహిరంగసభకు వచ్చిన పవన్ ఏదో మాట్లాడతాడని జనసైనికులు అనుకుంటే ఇంకేదే మాట్లాడమే కాకుండా.. వారిపైనే ప్రశ్నల వర్షం కురిపించి.. తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కడం.. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రజలు పెట్రోల్, గ్యాస్, జీఎస్టీ, దేశం మొత్తం ప్రైవేటీకరణ చేస్తామని బీజేపీ చెబుతున్నా దాని గురించి మాట్లాడకుండా.. ఇలా యూత్‌ను రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం ఎంతవరకు సబబో.. మరి!.