తెలంగాణలో బీజేపీ తనను పదే పదే అవమానిస్తోందని.. కేంద్రం అంతా సానుకూలంగా ఉన్నా.. రాష్ట్ర స్థాయిలో బీజేపీ సహకరించట్లేదని జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుక కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కుండ బద్దలుకొట్టిన విషయం విదితమే. అంటే తెలంగాణలో బీజేపీతో సంబంధం లేకుండా మిత్రపక్షం నుంచి తొలిగినట్లే. ఇదే పరిస్థితి ఏపీలో కూడా జరుగుతుందని అందరూ భావించారు… అదే జరిగితే బాగుంటుందని జనసేన కార్యకర్తలు, పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. అదెప్పుడు జరుగుతుందో తెలియట్లేదు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి తన మద్దతు ఇవ్వనని … టీఆర్ఎస్‌కే మద్దతిస్తానన్న పవన్.. త్వరలో నాగార్జున సాగర్ ఎన్నికలు ఉండటంతో కీలక నిర్ణయం తీసుకున్నారు.
దుబ్బాక ఉపఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటి ఫుల్ క్రీజ్‌లో ఉన్న బీజేపీ సాగర్ ఉప ఎన్నికలో కూడా గెలిచి కాషాయ జెండా పాతాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కమలనాథులు వ్యూహాలు భావిస్తున్నారు. ఈ తరుణంలో పవన్ నల్గొండ జిల్లాతో పాటు సాగర్ నియోజకవర్గానికి కమిటీలను ఏర్పాటు చేశారు. అంటే బీజేపీతో కలిసి కాకుండా విడిగానే పోటీ చేయాలని పవన్ నిర్ణయానికి వచ్చారన్న మాట. అందులో భాగంగానే ఇలా కమిటీలను ఏర్పాటు చేశారన్నడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదేమో. అంటే బండి సంజయ్‌కు ఛాలెంజ్ చేస్తూ ఎదురెళ్తున్నాడనే చెప్పాలి.
ఇంతవరకూ ఓకే గానీ ఎన్నికలు దగ్గరపడ్డాక మళ్లీ ఎవరో కాషాయ నేతలు మంతనాలు జరిపితే వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తే సరి లేకుంటే.. మిత్రపక్షం కోసం, పెద్దల నిర్ణయం మేరకు బీజేపీకే సపోర్ట్ చేయండని చెబితే అంతకన్నా హీనం ఇంకొకటి లేదని రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు చెబుతున్నారు. మరి ఒక్కటే మాట మీదుండి అభ్యర్థిని రంగంలోకి దింపి తన సత్తా ఏంటో బీజేపీకి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోటీలోకి జనసేన దిగితే మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కచ్చితంగా చీలిపోతాయ్.. బీజేపీకి ఊహించని విధంగా గట్టి ఎదురుదెబ్బే తగులుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి పవన్ మనసులో ఏముందో ఏంటో ఆయనకే ఎరుక.