ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా వైసీపీ సీట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచీ ఇప్పటి వరకూ జగన్ తన మార్క్ ఏంటో చేసి చూపించారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎంలను ఐదుగుర్ని పెట్టడం, తాను అధికారంలోకి దోహదపడిని నవరత్నాలు అమలు చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మంత్రి పదవుల కేటాయింపు.. డిప్యూటీ సీఎంలు ఐదుగుర్ని పెట్టడంతో ఆయన పేరు దేశం మొత్తం మార్మోగింది. అంతేకాదు.. కొన్ని కొన్ని రాష్ట్రాలు ఇదే ట్రెండ్‌ను కూడా ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కర్ణాటకలో పరిశీలనలో ఉండగా.. తాను అధికారంలోకి వస్తే ఏపీలో లాగే తమిళనాడులో కూడా ఉంటుందని డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ కూడా ప్రకటించేశారు.
అయితే.. అప్పుడు కేబినెట్ ఎలాగైతే జగన్ చేశారో.. ఇప్పుడు మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ దాన్నే ఫాలో అయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్లలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు.. మున్సిపాలిటీల్లో ఇద్దరు వైస్ చైర్మన్లను నియమించబోతున్నారు. మార్చి-18న జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఒక్కొక్కరుగానే ప్రమాణం చేయించగా.. త్వరలోనే ‘ఇద్దరు’కు సంబంధించి ఆర్డినెన్స్‌ను గవర్నర్ ముద్ర పడగానే అమల్లోకి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారట. ఈ ప్రక్రియ త్వరలోనే జరగనుందని.. దీంతో ఆశావహులకు, ఎక్కువ మందికి పదవులు ఇచ్చినట్లు అవుతుందని.. నేతల్లో అసంతృప్తి రాకుండా చేయడానికే సీఎం ఇలా చేస్తున్నారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ఈ నిర్ణయాన్ని చాలా మంది మెచ్చుకుని ప్రశంసల జల్లు కురిపిస్తుండగా.. ఈ ‘ఇద్దరు’ కాన్సె్ప్ట్ ఏంటి కొత్తగా.. ఎక్కడైనా ఉందా ఇలా..? అంటూ టీడీపీకి చెందిన కొందరు సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రేపొద్దున జరగబోయే పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందట. సో.. ఇలా ఎన్నికలు ఏదైనా జగన్ మళ్లీ.. మళ్లీ తన మార్క్ పాలిటిక్స్ చేస్తున్న ముఖ్యమంత్రి ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం దోహదం చేస్తాయో వేచి చూడాలి.