ఎన్నికలొద్దు.. వద్దంటే వద్దు.. అన్నారు.. ఎన్నికలకెళ్లారు.. ఎవరూ ఊహించని దానివిధంగా పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచారు. సర్పంచ్‌లు, మేయర్, చైర్మన్‌లతో ప్రమాణ స్వీకారం కూడా చేయించేశారు. త్వరలోనే పరిషత్ ఎన్నికలు జరుపుకుని ఇక సార్వత్రిక ఎన్నికలు దాకా ఎన్నికలే ఉండకూదని వైసీపీ యోచిస్తోంది. ఈ తరుణంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై ఒక్కసారిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. అదేదో సినిమా డైలాగ్‌లా.. ‘నిమ్మగడ్డ నిన్నొదలా’ అంటూ ఇప్పుడు మళ్లీ మంత్రి రంగంలోకి దిగారు.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలంటూ ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. అప్పట్లో ఈ వ్యవహారంపై పెద్ద హడావుడే జరిగింది. ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా ఇద్దరి మధ్య మాటల తూటాలు కూడా పేలాయ్. చివరికి ఎస్ఈసీ ఆదేశాల ప్రకారమే ఆయన ఇంటికి పరిమితం అయ్యారు. పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు, ఫలితాలు, ప్రమాణ స్వీకారం అంతా పూర్తయ్యే సరికి మళ్లీ పెద్దిరెడ్డి రంగంలోకి దిగి.. తాడో పేడో తేల్చుకోవాలని నిమ్మగడ్డపై ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చారు. మొత్తానికి చూస్తే ఎన్నికల కమిషన్ చర్యను పెద్దిరెడ్డి అవమానంగా భావించారని దీన్ని బట్టి తెలుస్తోంది. అందుకే ఇంత సీరియస్‌గా తీసుకుని ఆయన ఇలా చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
తాజా నోటీసులతో నిమ్మగడ్డ-ప్రభుత్వం మధ్య వార్ మరింత ముదిరినట్లయ్యింది. తాజాగా ఇచ్చిన నోటీసులతో నిమ్మగడ్డ వర్సెస్ రమేష్‌గా ఎపిసోడ్ మారిపోయింది. పెద్దిరెడ్డి ఫిర్యాదు మీద వివరణ ఇవ్వాలని.. విచారణకు కూడా అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ నెల 19 నుంచి 22 వరకూ సెలవుపై వెళ్లడానికి నిమ్మగడ్డ సిద్ధమయ్యారు. ఇలా నోటీసులు రావడంతో దీనిపై నిమ్మగడ్డ ఏం చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే దీని వెనుక పరిషత్ ఎన్నికల వ్యవహారం ఉందని తాజాగా కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంపై నిమ్మగడ్డ ఎలా ముందుకెళ్తారు..? ప్రివిలేజ్ కమిటీ ముందుకొస్తే పరిస్థితి ఎలా ఉంటుంది..? అనేదానిపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది.