జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ ఎంపీ, రాజకీయాల నుంచి వాలంటరీ రిటైర్మంట్ తీసుకున్న లగడపాటి రాజగోపాల్‌కు ఎందుకు ప్రేమ ఒక్కసారిగా ఒలకబోశారు. ఆయన మాటలను బట్టి చూస్తుంటే రేపో.. మాపో జనసేన కండువా కప్పుకుంటారా..? అన్నట్లుగానే ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు. ఇంతకీ పవన్‌పై ఆయనకు ఎందుకంత ప్రేమ కురిపించారు..? మరోవైపు వైఎస్ జగన్ గురించి లగడపాటి ఏం మాట్లాడారు..? అనే విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఏపీలో ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికలు హాట్ హాట్‌గా జరుగుతున్న విషయం విదితమే. ఈ ఎన్నికల్లో భాగంగా లగడపాటి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడి.. ఇటుపై పవన్‌పై ప్రశంసలు కురిపించి.. జగన్ గురించి కూడా మాట్లాడారు. పలు సందర్భాల్లో పవన్ బెస్ట్. గెలిచినా, ఓడినా పవన్ ప్రజలను అట్టిపెట్టుకునే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైనా… స్థానిక ఎన్నికల్లో బరిలోకి దిగడం అభినందనీయం. పవన్ రాజకీయంగా గొప్పగా అడుగులు వేస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే జగన్‌తో నాకు పరిచయం ఉంది. రాజకీయ పార్టీల మధ్య పోటీ చాలా ఎక్కువైపోయింది. అందుకే ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నాయి. నాడు వైఎస్ హయాంలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా ఉండేవి’ అని లగడపాటి చెప్పుకొచ్చారు.
అంతటితో ఆగని ఆయన తన ప్రత్యక్ష రాజకీయాల గురించి మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నానన్నారు. ఇదివరకు తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని ఆయన వెల్లడించారు. ఒక్క రాజకీయాలకే కాదు.. రాజకీయ సర్వేలకు సైతం దూరంగా ఉన్నానన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో ఆలయాలపై దాడులు జరుగుతుండటానికి గల కారణాలను పోలీసులు, ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే లాంగ్ గ్యాప్ తర్వాత రాజీకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న లగడపాటి వ్యాఖ్యలతో మరోసారి తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. మున్ముందు ఏమైనా మనసుమార్చుకుని జనసేనలో చేరుతారేమో వేచి చూడాలి.