ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్ లో టీమిండియా అద్భుతంగా ఆడి చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. సీనియర్లంతా జట్టుకు దూరమైన కుర్రాళ్ళు చెలరేగి చరిత్ర సృష్టించారు. కనీస అంతర్జాతీయ అనుభవం లేని యువ ఆటగాళ్లు సమష్టిగా రాణించి పటిష్టమైన ఆస్ట్రేలియాను మట్టి కరిపించారు. ఈ విజయంలో టీమిండియా యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తో పాటు శార్దూల్ ఠాకూర్, నటరాజన్, రిషబ్ పంత్, శుభ్ మన్ గిల్ అద్భుత ప్రదర్శన చేశారు.
ఇక కెరీర్‌లో తొలి టెస్టు ఆడిన సుందర్.. అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అతడికి ఆ స్టేడియం, ఆ వేదిక ఎంతగానో గుర్తుండిపోయాయి. బ్రిస్బేన్‌లోని ‘గాబా’ స్టేడియం జరిగిన ఆ మ్యాచ్‌కు గుర్తుగా ఆ స్టేడియం పేరునే తన బుజ్జి కుక్క పిల్లకు పెట్టుకున్నాడు. మా ఇంట్లోకి కొత్త సభ్యుడు వచ్చాడంటూ తన కుక్క ‘గాబా’ను పరిచయం చేశాడు. తన ఇన్స్టాగ్రామ్ లో దీనికి సంబంధించి ఫోటోలను కూడా పోస్ట్ చేసాడు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కాగా.. 1993లో ఆస్ట్రేలియాపై సిడ్నీ వేదికగా తన తొలి టెస్టు సెంచరీ (277) చేసిన దిగ్గజం బ్రియాన్ లారా తన కూతురుకు ‘సిడ్నీ’ అని పేరు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇలానే మరికొంతమంది ఆటగాళ్లు కూడా తమకు కలిసొచ్చిన, లేదా గుర్తుండిపోయే మ్యాచ్ లకు సంబంధించి ఇలాంటి పనులే చేస్తుంటారు.