ప్రముఖ పారిశ్రామికవేత్త నిర్మాత జవ్వాజి రామాంజనేయులు గ్రామ ప్రజల కోసం నేడు (అక్టోబర్ 28) శ్రీ సీతా నరసింహాగార్డెన్స్‌ను ప్రారంభించారు. నిర్మాత జవ్వాజి రామాంజనేయులు ఓ సారి తన గ్రామంలోని ఓ ఇంట్లో విందు కార్యక్రమానికి హాజరయ్యారంట, ఆరోజే సడన్‌గా వర్షం పడటంతో ఎంతో ఆహారం వృథాగా పోయిందట. భవిష్యత్తులో అలాంటి సమస్యలు తన గ్రామస్థులకు ఎదురుకాకుండా ఉండేందుకే శ్రీ సీతా నరసింహాగార్డెన్స్‌ను ప్రారంభించానని తెలిపారు. ఈ ప్రారంబోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు, అద్దంకి వినుకొండ గురజాల శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట టీడీపీ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు తదితరులు హాజరయ్యారు.
తనకు జన్మనిచ్చిన గ్రామానికి సేవ చేయాలనే ఆలోచనతో గ్రామస్తులు ఉపయోగపడే ఆధునాతన కళ్యాణ మండపం నిర్మించానని, గోగులపాడు గ్రామంతో పాటు పరిసర గ్రామాల వారికి అందుబాటులో ఉండే విధంగా వివాహాది శుభకార్యములకు ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేశానని తెలిపారు.
ఈ కళ్యాణమండపాన్ని వారి గ్రామంతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల వారు శుభకార్యాలకు ఉచితంగా ఉపయోగించుకునే సదుపాయం కలుగజేశారు.