Friday, November 1, 2024

‘పిండం’ చిత్ర దర్శకుడు సాయికిరణ్ దైదా ఇంటర్వ్యూ

ప్రముఖ హీరో  శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సాయికిరణ్ దైదా విలేఖర్లతో ముచ్చటించి చిత్ర విశేషాలను పంచుకున్నారు.
‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనే ఉప శీర్షిక పెట్టారు.. అసలు సినిమా ఎలా ఉండబోతుంది?
నల్గొండ జిల్లాలో ఒక ఘటన జరిగింది. అది మా నాయనమ్మ చెప్పడం వల్ల నాకు బాగా గుర్తుండిపోయింది. దాని చుట్టూ కథ అల్లుకొని, ఎలాంటి సినిమా తీస్తే బాగుంటుందని ఆలోచించాను. దీనిని హారర్ జానర్ లో చెప్తే బాగుంటుంది అనే ఆలోచనతో పిండం సినిమా మొదలుపెట్టాను. యదార్థ ఘటన చుట్టూ కల్పిత కథ అల్లుకోవటం జరిగింది. ప్రేక్షకులు హారర్ జానర్ సినిమాలు చూడటానికి వచ్చేది భయపడటం కోసమే. ఆ హారర్ అనుభూతిని కలిగించి, భయం ఇవ్వాలి. ఇది నా మొదటి సినిమా కాబట్టి భారీ తారాగణం ఉండదు. కథ బలంగా ఉండాలి. దానిని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ని ఎంతో శ్రద్ధతో రాసుకోవడం జరిగింది. హారర్ సినిమా కాబట్టి ప్రేక్షకులను భయపెట్టే సన్నివేశాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. సినిమా మొత్తం పూర్తయ్యాక, సినిమా చూసుకొని విజయం పట్ల మరింత నమ్మకం కలిగింది. అప్పుడే ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనే ట్యాగ్ లైన్ పెట్టి ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాము.
పిండం అనే టైటిల్ పెట్టడానికి కారణమేంటి?
పిండం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు పిండాకారం అంటారు. అలాగే ఒక మనిషి చనిపోయాక పెట్టేది కూడా పిండం అనే అంటాం. అసలు అది ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే కథలో కోర్ పాయింట్ అదే. నేను కథ రాసుకున్నప్పుడే పిండం టైటిల్ అనుకున్నాం. ఇలాంటి నెగటివ్ టైటిల్ ఎందుకు, అసలే ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ అని నా టీమ్ మెంబర్స్ కూడా పిండం టైటిల్ మార్చమన్నారు. అయితే ఒక మూఢ నమ్మకాన్ని పట్టుకొని, కథకి సరిగ్గా సరిపోయే టైటిల్ ని కాదని వేరే టైటిల్ పెట్టడం నాకు కరెక్ట్ కాదు అనిపించింది. సినిమా చూశాక అందరూ అంటారు.. ఇదే ఈ సినిమాకి కరెక్ట్ టైటిల్ అని. భవిష్యత్ లో కూడా నేను ఏ సినిమా చేసినా కథకి సరిపోయే టైటిలే పెడతాను.
నల్గొండలో జరిగిన ఘటన ఏంటి? సినిమా నల్గొండ నేపథ్యంలోనే ఉంటుందా?
ఆ ఘటన గురించి ఇప్పుడు మీకు చెప్పలేను. సినిమా చూశాక తెలుస్తుంది. ఆ ఘటన చుట్టూ అల్లుకున్న కల్పిత కాబట్టి, మెదక్ జిల్లాలోని శుక్లాపేట్ లో జరిగినట్లుగా సినిమాలో చూపించాం.
మీ గురించి చెప్పండి?
చిన్నప్పటి నుండి నాకు రాయడం అంటే ఇష్టం. కాలేజ్ సమయంలో బ్లాగ్స్ రాసేవాడిని. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ లు, అక్కడి నుంచి ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ లు రాయడం అలవాటు చేసుకున్నాను. యూఎస్ లో బిజినెస్ ఉన్నప్పటికీ స్క్రిప్ట్ లు రాయడం కొనసాగించాను. నాకు ఎప్పుడైతే పట్టు వచ్చింది అనిపించిందో అప్పుడు సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయలేదు.
మీ మొదటి సినిమా కోన వెంకట్ గారితో చేయాల్సి ఉంది కదా?
కోన వెంకట్ గారు నాకు యూఎస్ లో పరిచయం. ఒకసారి ఆయనకు నేను రాసుకున్న క్రైమ్ కామెడీ కథ చెప్పాను. ఆ కథ కోన గారికి బాగా నచ్చింది. అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. దానికి సిద్ధు జొన్నలగడ్డ హీరో. డల్లాస్ లోనే షూటింగ్ జరగాల్సి ఉంది. కానీ అప్పుడు కోవిడ్ కారణంగా కుదరలేదు. ఆ తర్వాత డీజే టిల్లు సినిమా వచ్చి సిద్ధు ఇమేజ్ మారిపోయింది.
శ్రీరామ్ గారిని తీసుకోవాలి అనే ఆలోచన ఎవరిది?
నాకు మూడు నాలుగు కాస్టింగ్ ఆప్షన్లు ఇచ్చారు. అందులో శ్రీరామ్ గారి పేరు చూడగానే ఎగ్జైట్ అయ్యాను. ఆయన నటించిన ఎన్నో సినిమాలు చూసి ఉన్నాను. ఆయన ఎలా నటిస్తారో తెలుసు. ఈ పాత్రకి శ్రీరామ్ గారు నూటికి నూరుశాతం సరిపోతారు. ఆయనలో ఒక వింటేజ్ లుక్ ఉంటుంది. 1990ల కథకి ఆయన బాగా సెట్ అవుతారు.
టీజర్ కి, ట్రైలర్ కి ఎలాంటి స్పందన లభించింది?
టీజర్ కి, ట్రైలర్ కి రెండింటికీ మంచి స్పందన వచ్చింది. కేవలం టీజర్ తోనే మా సినిమా బిజినెస్ అయిపోయింది. ట్రైలర్ చూసి ఎందరో అభినందించారు. మీరు టీజర్, ట్రైలర్ లో చూసిన దానికంటే ఎన్నో రెట్ల కంటెంట్ సినిమాలో ఉంటుంది.
షూటింగ్ లో ఏమైనా ఛాలెంజింగ్ గా అనిపించిందా?
ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి తగినంత సమయం కేటాయించి, పూర్తి క్లారిటీతోనే షూటింగ్ కి వెళ్ళాం. అందుకే ఛాలెంజింగ్ గా ఏం అనిపించలేదు. అయితే సెట్స్ లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా క్లైమాక్స్ చిత్రీకరించేటప్పుడు కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది. ఆరు రోజుల షెడ్యూల్ అది. ఈశ్వరి గారి తలకి గాయం కావడంతో పాటు కొన్ని ఘటనలు జరిగాయి. ఆ సమయంలో ఏంటి ఇలా జరుగుతుంది అని కాస్త భయం వేసింది. ఆ సమయంలో మరింత శ్రద్ధగా, బాధ్యతగా పని చేశాం. అలాంటి కొన్ని ఘటనలు తప్ప మిగతా షూటింగ్ అంతా సాఫీగానే జరిగింది.
మిగతా హారర్ చిత్రాలతో పోలిస్తే పిండం వైవిధ్యంగా ఉంటుందా?
ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన హారర్ సినిమాలన్నీ ఒక ఎత్తు. మా పిండం సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏదో భయపెట్టాలని ఒక హారర్ సీన్ పెట్టడం అలా ఉండదు. బలమైన కథ ఉంటుంది. స్క్రీన్ కి అతుక్కొని మరీ చూస్తారు. సినిమా అంత ఆసక్తికరంగా ఉంటుంది. పాత్రలకు మనం ఎంతలా కనెక్ట్ అయితే, భయం అనేది అంత బాగా పండుతుంది. ఊరికే ఏదో హారర్ పెట్టాలి అన్నట్టుగా ఉండదు. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. అప్పుడే భయం ఇంకా ఎక్కువ పండుతుంది. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ సినిమాలకి ట్రెండ్ కూడా బాగుంది. మాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాం.
ఆత్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కదా.. ఏమైనా రీసెర్చ్ చేశారా?
ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. ఎన్నో పుస్తకాలు, ఆర్టికల్స్ చదివాను. సబ్జెక్ట్ లోకి మరింత లోతుగా వెళ్ళడం కోసం అంతగా రీసెర్చ్ చేశాను. ఎప్పుడూ వచ్చే హారర్ సినిమాల్లాగా కాకుండా, కొత్తగా ఎలా చూపించాలి అనే దానిపై ఎంతో వర్క్ చేశాము. క్లైమాక్స్ సన్నివేశంలో.. వివిధ భాషల్లో ఉండే నిజమైన మంత్రాలను తెలుసుకొని పెట్టడం జరిగింది.
సంగీతం గురించి?
ఈ సినిమాలో సంగీతానికి చాలా మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది.
మీ తదుపరి చిత్రం?
కృష్ణుడి లంక అనే క్రైమ్ కామెడీ సినిమా చేయబోతున్నాను. హీరో పేరు కృష్ణ, అతను శ్రీలంకలో ఉంటాడు. ఎందుకు అక్కడ ఉంటున్నాడు? అతని సమస్య ఏంటి? అనేది కథ. ఇంకా హీరో ఎవరు అనేది అనుకోలేదు. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాను.
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x