సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఓ సూపర్ టాలెంట్ దూసుకొచ్చింది. మల్టీటాలెంట్‌తో అదరగొడుతోంది. నటుడిగా, మోడల్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా, బహుభాషావేత్తగా ప్రతిభ చూపిస్తూనే.. కరాటే, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్.. ఇలా వేర్వేరు రంగల్లోనూ ఓ వెలుగు వెలుగుతోంది. ఆ యంగ్ టాలెంట్ పేరు శరణ్ కుమార్. జన్మదినం జరుపుకుంటున్న శరణ్ కుమార్‌కు శుభాకాంక్షలు అందిస్తూ ఆయన లైఫ్ జర్నీ తెలుసుకుందాం.
శరణ్ కుమార్ సినీఇండస్ట్రీకి చెందిన కుటుంబంలో 1997 సెప్టెంబరు 4 న జన్మించాడు. ఇండస్ట్రీ లెజెండ్స్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ గ్రహీత దివంగత విజయ నిర్మల, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సూపర్ స్టార్ కృష్ణ ప్రభావంతో పెరిగారు. చాలా చిన్న వయసులోనే ఓ వైపు తన చదువును కొనసాగిస్తూ మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. శరణ్ కుమార్ స్కూల్ సమయంలోనే సాంస్కృతిక కార్యక్రమాలలో థియేటర్ ప్లేస్‌లో నటించడం ప్రారంభించాడు. చిన్నతనంలోనే సినిమాల పట్ల మక్కువ పెంచుకున్నాడు. అతను కళ పట్ల అపారమైన అనుబంధాన్ని కూడా పెంచుకున్నాడు.
తన ప్రతిభతో పాఠశాలలో డ్రామా నాటకాల్లో స్కెచింగ్, క్రాఫ్టింగ్, పెయింటింగ్, రైటింగ్, యాక్టింగ్ ప్రారంభించాడు. ఇంటర్, డిస్ట్రిక్ట్ స్కూల్, స్టేట్ లెవల్‌లో అనేక అద్భుతమైన ఆర్ట్ అవార్డులను గెలుచుకున్నాడు. 5 భాషలు (ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, ఫ్రెంచ్) మాట్లాడే శరణ్ స్కూల్ పూర్తి కాకముందే బహుభాషావేత్త అయ్యాడు. అతని కళాత్మక స్వభావాన్ని అన్వేషిస్తూ, అతను ఉత్తమ మాస్టర్స్‌లో శిక్షణ పొందాడు. అనేక స్పారింగ్ పోటీలను గెలుచుకున్నాడు. చిన్న వయస్సులోనే కరాటే, తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించాడు. కిక్ బాక్సింగ్, మిక్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని నైపుణ్యాన్ని మరింతా పెంచుకున్నాడు.
శరణ్ కుమార్ చిన్న వయసు నుంచే పలు అంశాల్లో తిరుగులేని ప్రతిభ చూపుతూ తానేంటో నిరూపించుకున్నాడు. మూవీ రైటింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీలో తన సినీ కెరీర్‌ను ప్రారంభించాడు.
విజయ నిర్మల, కృష్ణ ప్రభావంతో యుక్తవయస్సులోనే మోడలింగ్, షార్ట్ ఫిల్మ్‌లు తీశాడు. అంతేకాదు మోడలింగ్, మ్యూజిక్, స్క్రిప్ట్ రైటింగ్, ఫోటోగ్రఫీ.. వంటివి నేర్చుకున్నాడు.
సినీ పరిశ్రమలోకి అరంగేట్రం కోసం తన నైపుణ్యాలను పదును పెట్టడానికి డ్యాన్స్, హార్స్ రైడింగ్, సర్ఫింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. నంది అవార్డు విజేతల దగ్గర, థియేటర్ మాస్టర్స్, పీహెచ్‌డీలు చేసిన వారి దగ్గర నుంచి నటనలో శిక్షణ పొందాడు. అదే సమయంలో మరోవైపు బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. తన చిన్ననాటి కలను ప్రారంభించేందుకు చిన్న వయస్సులోనే మెయిన్ రోల్‌గా పలు సినిమా అవకాశాలను అందుకున్నాడు. మిస్టర్ కింగ్ సినిమాతో హీరోగా సినీ ఎంట్రీ ఇచ్చాడు శరణ్ కుమార్.
ఒకే సమయంలో డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్.. వంటివి నేర్చుకుంటూనే, హీరోగా తన బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విభిన్న జానర్ సినిమాలు చేయడంతోపాటు, ప్రతిభావంతులైన కొత్త నిర్మాణ సంస్థలతో కలిసి పని చేస్తున్నాడు.
ఈ ఏడాది సాక్షి, మిస్టర్ కింగ్.. రెండు సినిమాల్లో హీరోగా చేశాడు. మరిన్ని అవకాశాలు అందుకుంటున్నాడు. తన ఫ్యామిలీ వారసత్వాన్ని నిలబెట్టేలా, లెజెండరీ అడుగుజాడలను అనుసరిస్తూ సినీ పయనం కొనసాగిస్తున్నాడు. మల్టీటాలెంట్ చూపిస్తున్న శరణ్ కుమార్ తెలుగు ఇండస్ట్రీకి దొరికిన అరుదైన ఆణిముత్యం అని చెప్పొచ్చు.