కనీస అంతర్జాతీయ అనుభవం లేని, విదేశీ గడ్డపై ఎప్పుడూ అడుగూ కూడా పెట్టని రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లు ఆసీస్ దిగ్గజ జట్టును మట్టి కరిపించారు. టెస్ట్, టీ20 సిరీస్‌లను గెలిచి చరిత్ర సృష్టించారు. మహ్మద్ సిరాజ్, నటరాజన్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లంతా ఆస్టేలియా పర్యటనలో అదరగొట్టారు. కనీస అనుభవం లేకపోయినా ఆస్ట్రేలియాను ఆ దేశ గడ్డపైనే ఓడించి కప్పు గెలిచారు. తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్ ద్వారా కూడా కొంతమంది యువ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. అడుగు పెట్టడమే మెరుపులు మెరిపించారు.
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ రెండో మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశారు. ఇక వన్డేల విషయానికొస్తే కృనాల్ పాండ్యా, ప్రసిద్ద్ కృష్ణ కూడా తొలి వన్డేతో అరంగేట్రం చేసి అదరగొట్టారు. తొలి వన్డేలోనే వీరిద్దరూ అనేక రికార్డులు నెలకొల్పారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే క్రికెట్ చరిత్రలో ఎవరూ సాధించని స్థాయిలో అతితక్కువ బంతుల్లో అర్థ సెంచరీ చేసి కృనాల్ ఇరగదీశాడు. సీనియర్ బౌలర్లకంటే గొప్పగా ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తీసి సత్తా చాటాడు.
టీమిండియా యువ క్రికెటర్లపై మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ యువ క్రికెటర్లను అభినందించాడు. ‘కొన్ని రోజులుగా యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లు తమకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. రెండో టీ20లో ఇషాన్ కిషన్ అరంగేట్రం చేసి అర్థ సెంచరీతో అదరగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా అదే మ్యాచ్‌తో జట్టులోకొచ్చినా బ్యాటింగ్ చేయలేకపోయాడు. బ్యాట్ చేతికి వచ్చిన నాలుగో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అందుకే త్వరలో రాబోయే టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టులో వీళ్లిద్దరూ ఉండాలని నేను భావిస్తున్నాను. వరల్డ్‌కప్ తుదిజట్టులో ఆడేందుకు వీరిద్దరికి పూర్తి అర్హత ఉంది’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.