పాక్ ఆటగాళ్ల 14 ఏళ్ల నిరీక్షణకు వచ్చే ఏడాది ఐపీఎల్‌తో తెరపడనుందా..? మళ్లీ ఐపీఎల్ జెర్సీల్లో పాక్ ఆటగాళ్లు కనపడనున్నారా..? అంటే నిజమే అనుకున్నారు. తొలి సీజన్ తరువాత 14 ఏళ్లుగా ఈ టోర్నీకి దూరమైన పాక్ క్రికెటర్లు మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెట్టేందుకు వచ్చే ఏడాది టోర్నీ వేదికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్, పాక్‌ల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. చర్చలకు ఇరు దేశాధినేతలు అంగీకరించి, ఆ చర్చలు విజయవంతంగా ముగిస్తే.. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో పాక్ క్రికెటర్లు ఆడే అవకాశముంది.
షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం పాక్ క్రికెటర్లు భారత్‌కు రానున్నారు. ఈ టీ20లో పాక్ ఆటగాళ్లు పాల్గొని అంతా సవ్యంగా జరిగితే.. ఆ తరువాత ఇరు దేశాల మధ్య టీ20 సిరీస్ జరుగుతుందన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఈ మేరకు పాకిస్తాన్ మీడియాలో ఇప్పటికే ప్రత్యేక కథనాలు సైతం ప్రచురితమయ్యాయి. అయితే దీనిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులూ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కాగా, పాక్ ఆటగాళ్లు 2008లో తొలిసారిగా లీగ్‌లో పాల్గొన్నారు. ఇదే వారికి మొదటిది, ఆఖరిది. అప్పుడు 12 మంది పాక్ ఆటగాళ్ళు వివిధ ఫాంచైజీలకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సీజన్‌లో మొత్తం 8 జట్లు పోటీలో ఉండగా, 5 జట్ల తరఫున 12 మంది పాక్ క్రికెటర్లు ప్రాతినిధ్యం వహించారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ అత్యధికంగా నలుగురు పాక్ ఆటగాళ్లకు అవకాశం కల్పించగా, రాజస్థాన్ రాయల్స్ ముగ్గురిని, ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెరో ఇద్దరిని కొనుగోలు చేశాయి. ఇక పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది హైదరాబాద్‌కు చెందిన డెక్కన్ చార్జర్స్ తరపున బరిలోకి దిగాడు.