దుబాయ్: అత్యంత పటిష్ఠ బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్ నిర్వహిస్తున్నప్పటికీ.. ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఐపీఎల్ 14 సీజన్ అర్థాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. టోర్నీలో 31 మ్యాచ్‌లు మిగిలుండగానే వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఆటగాళ్లంతా వారి వారి దేశాలకు వెళ్లిపోయారు. కానీ మిగతా మ్యాచ్‌లను నిర్వహించకపోతే బీసీసీఐ వేల కోట్లు నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో ఎలాగైనా సెకండ్ షెడ్యూల్ నిర్వహించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే యూఏఈ వేదికగా సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 10 మధ్యలో ఈ రెండో షెడ్యూల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఈ క్రమంలోనే ఆ మ్యాచ్‌లకు పేక్షకులను అనుమతించాలని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) నిర్ణయించింది. అయితే గతేడాది కోవిడ్ నేపథ్యంలోనే ఐపీఎల్ 13వ సీజన్‌ను యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించింది. అయితే టోర్నీ మొత్తం ఖాళీ స్టేడియాల్లోనే జరిగింది. కానీడ ప్రస్తుతం ఆ దేశంలో కరోనా అదుపులోనే ఉండటంతో పాటు 70 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో మ్యాచ్‌లు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి మ్యాచ్‌కు 50 శాతం మంది ప్రేక్షకులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈసీబీ అధికారి ఒకరు తెలిపారు. అయితే టీకాలు వేసుకున్న ప్రేక్షకులకు అనుమతించడంపై ఆలోచన చేస్తున్నామని సదరు అధికారి వెల్లడించారు.
కాగా.. ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్‌ల నిర్వహణ, ప్రేక్షకులను అనుమతించే విషయంపై బీసీసీఐ ఉన్నతాధికారుల బృందం కూడా ఆలోచన చేస్తోంది. దీనిపై వచ్చే బుధవారం ఈసీబీ అధికారులను బీసీసీఐ అధికారులు కలిసి చర్చిస్తారు. మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలి. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా అయితే కచ్చితంగా ప్రేక్షకులను అనుమతి లభించేలా ఉంది.