ఐపీఎల్ 2021లో భాగంగా తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడిన బెంగళూరు ఉత్కంఠ విజయం సాధించింది. చివరి బంతి వరకు పోరాడి సీజన్‌లో తొలి బోణీ కొట్టింది. ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చత్రం పుష్ప లుక్‌లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫోటోను మార్ఫ్ చేసి స్టార్ స్టోర్ట్స్ తెలుగు ట్వీట్ చేసింది. దానికి ‘తగ్గేదే లే..’ అనే పంచ్ లైన్‌ను జత చేసింది. దీంతో పాటు ‘తగ్గేతే.. లే. ఆరంభం అదిరింది. ఓటమి సరిహద్దుల దాకా వెళ్లి విజృంభించే ప్రదర్శన మాదే అన్నట్టు ఆడేశారు. సరిలేరు మీకెవ్వరు అనే మాటకి నిదర్శనంగా నిలిచారు. #KohliMantra ఫలించింది. మొదటి మ్యాచ్లో #RCB గెలిచేసింది’ అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటో అటు ఆర్సీబీ ఫ్యాన్స్, విరాట్ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ఫ్యాన్స్‌కు కూడా తెగ నచ్చేసింది. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఈ ఫోటోపై తన స్టైల్లో కామెంట్ చేశాడు. నవ్వుతున్న ఎమోజీతో పాటు, థంబ్స్ అప్ సింబల్‌ను తన కామెంట్‌లో యాడ్ చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కాగా.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డబుల్ రోల్‌లో నటిస్తున్నాడు. ఓ రోల్ గంధపు చెక్కల స్మగ్లింగ్ చేసే మాస్ రోల్ కాగా.. మరొకటి స్టైలిష్ కనపడే క్లాస్ రోల్. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. సుకుమార్-బన్నీ కాంబినేషన్‌లో ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
కాగా.. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఆఖరి బంతి వరకు పోరాడి విజయం సాధించింది. ఇరు జట్ల బౌలర్లు కట్టుదిట్టండి బౌలింగ్ చేయడంతో బ్యాట్స్‌మన్ పరుగులు చేయడానికి చెమటోడ్చారు. తొలుత ముంబై బ్యాట్స్‌మన్‌ను బెంగళూరు బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టగా.. ఆ తరువాత బెంగళూరు బ్యాట్స్‌మన్‌ను ముంబై బౌలర్లు కూడా కట్టుదిట్టంగా అడ్డుకున్నారు. కాగా.. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు చివరి బంతి వరకు పోరాడి ఎలాగైతేనేం విజయం సాధించింది.