కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు భారత్ చిగురుటాకులా వణికిపోతోంది. ప్రతి రోజూ లక్షల కేసులు, వేల మరణాలతో అల్లకల్లోలమవుతోంది. ఈ సమయంలో కరోనా నుంచి కనీస రక్షణ పొందాలంటే ఎల్లప్పుడూ మాస్కులు, శానిటైజర్‌లు వాడుతూ, చేతులూ కాళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే చాలా మంది ఈ విధానాలను కచ్చితంగా పాటిస్తున్న వారు చేసే చిన్న పొరపాట్ల వలన కరోనా బారిన పడుతుంటారు. ఆ పొరపాట్లలో ప్రధానమైనది మాస్కులను రోజులు తరబడి వాడడం.
మీలో చాలా మంది క్లాత్ మాస్కులు వాడుతూ ఉండి ఉంటారు. వాటిని ఒకసారి వాడి పారేయడం సాధ్యం కాదు. దాంతో ఒకే మాస్కును ఒకటికంటే ఎక్కువ రోజులు వాడుతూ ఉంటారు. అదే మాస్కును శుభ్రం చేసి తిప్పి తిప్పి వినియోగిస్తుంటారు. అయితే ఇలా మాస్కులను వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనేది నిపుణుల వాదన. దీనిపై ప్రత్యేక అధ్యయనం నిర్వహించిన కొవిడ్ సాంకేతిక సలహా సమితి ఈ వివరాలను వెల్లడించింది. రోజురోజుకూ వేల కేసులు వస్తున్నప్పటికీ కనీస జాగ్రత్తగా ఉన్న మాస్కును సక్రమంగా ధరించడంలేదని, ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఏదో వేసుకోవాలంటే వేసుకొన్నట్టుగా ప్రజలు వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చింది. దానికి తోడు ప్రస్తుతం ఉపయోగిస్తున్న కాటన్ మాస్క్, లేదా సర్జికల్ మాస్క్, ఎన్-95 ఇతరత్రా మాస్కుల వల్ల వైరస్ వ్యాపించకుండా నిరోధించలేకోయినా కొంతవరకు రక్షణగా ఉంటాయని చెప్పింది.