మాస్ మహారాజా రవితేజ తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు పై లాంచింగ్ రోజు నుండే భారీ హైప్ నెలకొంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఓపెనింగ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత సినిమా కోసం వేసిన భారీ సెట్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం జాతీయ అవార్డ్ గ్రహీత, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ ను ఎంపిక చేశారు. టైగర్ నాగేశ్వరరావు నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన బాలీవుడ్ బ్లాక్బస్టర్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ లో అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని చేరిక సినిమా కాస్టింగ్ డిపార్ట్మెంట్ స్థాయిని పెంచడమే కాకుండా హిందీ మార్కెట్కు కూడా సహాయపడుతుంది.
టైగర్ నాగేశ్వరరావు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కావడంతో రాజీపడని బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు పేరు మోసిన స్టువర్ట్పురం దొంగ బయోపిక్ గా 70 నేపధ్యంలో రూపుదిద్దుకుంటుంది.
ఈ సినిమా కోసం రవితేజ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. డిక్షన్, డైలాగ్ డెలవరీ, గెటప్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటూ, మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపించబోతున్నారు రవితేజ. ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందిస్తున్నారు.
ఆర్ మదీ- ఐఎస్సి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ అందిస్తున్న ఈ చిత్రానికి మయాంక్ సింఘానియా సహ నిర్మాత.
తారాగణం: రవితేజ, అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, నాజర్, మురళీ శర్మ, ఎం నాసర్ తదితరులు