Friday, November 1, 2024

Masooda Review: ‘మసూద’ మూవీ రివ్యూ

సినిమా పేరు: మసూద
విడుదల తేదీ: 18-11-2022
నటీనటులు: సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్ తదితరులు
ఆర్ట్: క్రాంతి ప్రియం
కెమెరా: నగేష్ బానెల్
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
ఎడిటింగ్: జెస్విన్ ప్రభు
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
రచన, దర్శకత్వం: సాయికిరణ్

ఈ సృష్టిలో భక్తి, భయం ఎప్పుడూ ఫేమస్సే. భక్తి.. దేవుడికి సూచిక అయితే, భయం దెయ్యాలకు సూచిక. అయితే సైంటిఫిక్‌గా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న కాలంలో కూడా ఈ రెండూ.. మానవులని వదిలి వెళ్లడం లేదంటే.. వాటి పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వీటిని బేస్ చేసుకుని ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. భక్తి, భయం.. ఏదైనా సరే.. సరికొత్తగా అనిపించిన ప్రతిసారి ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడా భయం అనే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకుని వచ్చిన చిత్రమే ‘మసూద’. ఇప్పటి వరకు తీసిన రెండు చిత్రాలతో.. విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అనే ట్యాగ్ వేసుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందడం, సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్-ట్రైలర్స్.. ఇదొక డిఫరెంట్ చిత్రమని తెలియజేయడంతో పాటు.. ఎస్‌విసి బ్యానర్ ద్వారా దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నానని ప్రకటించడంతో.. సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. అలాగే ట్రైలర్ విడుదల చేసిన హీరో విజయ్ దేవరకొండ.. టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించడం, ‘అప్పుడే భయపడాల్సిన అవసరం లేదు.. అసలు భయం ముందుంది’.. అని మేకర్స్ చేసిన ప్రమోషన్స్‌ కూడా.. ‘మసూద’ గురించి మాట్లాడుకునేలా చేశాయి. వాస్తవానికి ఈ తరహా హర్రర్ డ్రామా చిత్రాలు వచ్చి చాలా కాలం అవుతుంది. ఆ గ్యాప్‌ని ఈ చిత్రం ఫిల్ చేసిందా? భయపెట్టడానికే అని మేకర్స్ చెబుతున్న ఈ ‘మసూద’ ప్రేక్షకులని థియేటర్లలో భయపెట్టిందా? అసలీ ఎవరీ ‘మసూద’? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
భర్త వదిలేసినా.. తన కుమార్తె నజియా (బాంధవి శ్రీధర్)తో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటూ సాధారణ జీవితం గడుపుతుంటుంది నీలమ్ (సంగీత). స్కూల్ టీచర్ జాబ్ చేసుకుంటూ.. కుమార్తెని చదివించుకుంటున్న నీలమ్‌కు.. అదే అపార్ట్‌మెంట్‌లో కింది ఫ్లోర్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే గోపీకృష్ణ(తిరువీర్).. ఏ అవసరం వచ్చినా సాయం చేస్తుంటాడు. గోపీ తన ఆఫీస్‌ కొలీగ్ మినీ(కావ్య కల్యాణ్ రామ్)ని ఇష్టపడుతుంటాడు కానీ.. చాలా పిరికివాడు కావడంతో ఆ విషయం చెప్పలేడు. మినీ కాస్త అడ్వాంటేజ్ తీసుకోవడంతో ఇద్దరూ ప్రేమించుకోవడానికి సిద్ధమవుతారు. ఇలా సాగిపోతున్న ఈ కథలో.. సడెన్‌గా నజియా ప్రవర్తనలో మార్పు రావడంతో.. నీలమ్ భయపడిపోతుంది. తన కుమార్తెను ఎలాగైనా రక్షించుకోవాలని, అందుకు గోపీ సాయం కోరుతుంది. నీలమ్, నజియాల పరిస్థితి చూసిన గోపీ అందుకు ఓకే చెబుతాడు. హాస్పిటల్‌లో చూపించినా నజియాకు నయం కాదు. ఆమె ప్రవర్తన రోజురోజుకూ మారిపోతుండటంతో.. అసలేమవుతుందో తెలుసుకునే ప్రయత్నంలో.. అందుకు కారణం ‘మసూద’ అని తెలుస్తుంది. అసలెవరీ ‘మసూద’? ఎందుకు నజియాని అలా ఇబ్బంది పెడుతుంది? ‘మసూద’ బారి నుండి నజియాను నీలమ్, గోపీ ఎలా కాపాడారు? గోపీ, మినీల ప్రేమ ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే ‘మసూద’.

నటీనటుల పనితీరు:
ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌గా, పిరికివాడిగా, సమయాన్ని బట్టి స్పందించే తీరున్న యువకుడిగా గోపీకృష్ణ పాత్రలో తిరువీర్ ఒదిగిపోయాడు. ఎక్కడా అతి అనిపించలేదు. తిరు నటన చాలా న్యాచురల్‌గా అనిపించింది. అతని కెరీర్‌కి ఇది ది బెస్ట్ చిత్రం అవుతుందని చెప్పుకోవచ్చు. సీనియర్ నటి సంగీత కొన్ని సీన్లలో కంటతడి పెట్టిస్తుంది. భర్త వదిలేసినా.. ధైర్యంగా మహిళ ఎలా బతకగలదో.. పిల్లలకు కష్టం వస్తే తల్లి ఎంతగా తపించిపోతుందనేది ఆమె పాత్ర ద్వారా చూపించారు. సంగీత ఈ పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. ‘మసూద’ బారిన పడిన నజియా పాత్రలోనూ, అలాగే స్టూడెంట్‌గానూ బాంధవి శ్రీధర్ నటన ప్రేక్షకులని కట్టిపడేస్తుంది. మినీ పాత్రలో కావ్య కళ్యాణ్ రామ్ పాత్రకు అంతగా స్కోప్ లేదు కానీ.. తనకున్న సన్నివేశాల్లో యూత్‌ని ఆకర్షించే ప్రయత్నం చేసింది. పీర్ బాబా పాత్రలో శుభలేక సుధాకర్, అతని అసిస్టెంట్‌గా సత్యం రాజేష్‌లకు మంచి పాత్రలు పడ్డాయి. మీర్ చాచా పాత్రలో నటించిన నటుడు, అతని తమ్ముళ్లుగా చేసిన వారు, సత్యప్రకాశ్, ఇంకా ఇతర పాత్రలలో చేసిన వారు.. వారి పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:
ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం, నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ హైలెట్ అని చెప్పుకోవచ్చు. సినిమా స్టార్టింగ్ సీన్‌లోనే వీరి పనితనం సినిమాపై ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేయడమే కాకుండా ఓ కొత్త అనుభూతిని కూడా ఇస్తుంది. ఫస్టాఫ్‌లో సినిమా స్లో నరేషన్‌లో నడిచినట్లు అనిపించింది. దానిపై ఎడిటర్ ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. ఆర్ట్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం అంటే.. ఖచ్చితంగా అందులో విషయం ఉంటుందనేలా మరోసారి నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిరూపించుకున్నాడు. ఈ బ్యానర్ వేల్యూని పెంచే చిత్రంగా ‘మసూద’ తెరకెక్కిందని బల్లగుద్ది చెప్పొచ్చు. ఇక దర్శకుడికి ఇది తొలి చిత్రం అంటే ఎవరూ నమ్మరు. ఆయన రాసుకున్న కథ, ఆ కథని తెరకెక్కించిన విధానం.. తొలి చిత్రంతోనే భయపెట్టాలని ఆయన భావించడం.. ఇలా అన్నింటికి మంచి మార్కులు పడతాయి.

విశ్లేషణ:
తొలి చిత్రంతో హర్రర్ డ్రామాని డీల్ చేయాలనుకోవడం నిజంగా సాహసమనే చెప్పుకోవాలి. ఎందుకంటే, ఏ మాత్రం తేడా కొట్టినా, దర్శకుడి కెరీర్ ఆ ఒక్క చిత్రంతో ముగిసిపోయినట్లే. అయితే ఈ సాహసంలో నెగ్గితే మాత్రం.. ఆ దర్శకుడికి ఇక తిరుగుండదు. చిత్ర దర్శకుడు సాయికిరణ్ ‘మసూద’తో సాహసమే చేశాడు. రాహుల్ యాదవ్ వంటి అభిరుచి గలిగిన నిర్మాత పక్కన ఉంటే ఏ దర్శకుడైనా సాహసం చేయడానికి ఎందుకు వెనకాడతాడు. తను చెప్పాలనుకున్న ‘మసూద’ కథని క్లారిటీగా చెప్పడమే కాదు.. అంతే క్లారిటీగా తెరపై ప్రజంట్ చేశాడు. సినిమా స్టార్టింగ్ సీన్‌లోనే సినిమా ఓ రేంజ్‌లో ఉండబోతుందని, భయపడటానికి సిద్ధంగా ఉండమని హింట్ ఇచ్చేసిన దర్శకుడు.. ఆ తర్వాత తిరు, మినీల ప్రేమకథని ఒకవైపు నడిపిస్తూనే.. మరోవైపు నజియా పాత్రతో భయపెట్టేలా చేశాడు. అన్ని బాగున్నాయి కానీ.. మసూదాబీ గురించి ఇంకాస్త వివరణ ఇచ్చి ఉండాల్సింది. ఆ పాత్ర తీరు కొంచెం కన్ఫ్యూజ్‌గానే అనిపిస్తుంది. అదలా ఉంటే.. ఇంటర్వెల్‌కి ముందు, తర్వాత కథ నడిచిన తీరు, సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేయడమే కాకుండా.. ఎగ్జయిట్‌కి గురి చేస్తే.. క్లైమాక్స్ మాత్రం దర్శకుడు కేక పెట్టించేశాడనే చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే.. సన్నివేశాలన్నీ సహజ సిద్ధంగా ఉండటం ఈ సినిమాకున్న ప్రధాన బలం. ఎందుకంటే.. ఇలాంటి కథలు అంటే క్షుద్రపూజాలు, ప్రేతాత్మ వంటి ఘటనలు ఇప్పటికీ పేపర్లలో వార్తలుగా దర్శనమిస్తూనే ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. చాలా కాలం తర్వాత ప్రేక్షకులకు ఓ మంచి హర్రర్ ఫీల్ ఇచ్చిన సినిమా ‘మసూద’. నిర్మాత రాహుల్ హ్యాట్రిక్ కొట్టేసినట్లే.

ట్యాగ్‌లైన్: పిరికివాళ్లు చూడొద్దు
రేటింగ్: 3.5/5

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x