నిష్కపటత్వంతో భక్తిని సమర్పించే సాధకుడిని ఆధ్యాత్మిక సంస్కృతి గొప్ప కర్మయోగిగా మారుస్తుందని అవధూత దత్తపీఠాధీశ్వరులు శ్రీ గణపతిసచ్చిదానందస్వామీజీ పేర్కొన్నారు. పరమ ఋషుల స్తోత్ర విద్యల, అందమైన వ్యాఖ్యానాలతో ప్రముఖరచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనం ‘శ్రీలలిత విష్ణు సహస్రనామ స్తోత్ర’ వైభవ గ్రంధాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు.
తెలుగురాష్ట్రాలలో విశేషకీర్తిని సాధించుకున్న ‘దర్శనమ్’ ప్రధాన సంపాదకులు మారుమాముల వెంకటరమణ శర్మ, తెలంగాణా రాష్ట్ర బ్రాహ్మణ సంఘ రాష్ట్ర నాయకులు భీంసేన్ మూర్తి ఈ పురాణపండ శ్రీనివాస్ ‘శ్రీసహస్ర’ గ్రంధాన్ని గణపతిసచ్చిదానందస్వామీజీకి అందజేశారు. జీవన పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా అపురూప విలువలతో, పవిత్ర సౌందర్య సొగసులతో, యజ్ఞభావంతో ఎన్నో పవిత్ర రచనా సంకలనాలను తెలుగు రాష్ట్రాలకు అందిస్తున్న పురాణపండ శ్రీనివాస్ ఆత్మబలం వెనుక ఉన్న దైవబలాన్ని స్పష్టం చేస్తూ గణపతిసచ్చిదానందస్వామీజీ మంగళాశాసనాలతో ఆశీర్వదించారు.
ప్రపంచం నుండి పరమాత్మవైపుకు మనస్సును మరల్చడమే దైవీయ చైతన్య గ్రంధాల లక్షణమని, మనిషిని సాధకునిగా, కార్య సాధకునిగా మార్చే పురాణపండ శ్రీనివాస్ శ్రీలలిత విష్ణు సహస్రనామ స్తోత్ర గ్రంధాలను కర్ణాటక తెలుగు భక్తులకు ఉచితంగా వితరణ చేస్తున్న భీంసేన్ మూర్తిని అభినందించారు.
శృంగేరి, కంచికామకోటి, అవధూత దత్తపీఠాధిపతుల అనేక శ్రీకార్యాలలో సంస్కృతీ విలువలతో పాల్గొనే దర్శనమ్ శర్మ అనేకసార్లు స్వామీజీ అనుగ్రహాన్ని పొందటం విశేషం. ఋషుల ఆశీర్బలమే ఆధారంగా పరమాద్భుతాలు అందిస్తున్న శ్రీనివాస్‌కు వేద శాస్త్రాల పట్ల వుండే పూజ్యభావమే ఇన్ని వేల మందికి గ్రంథ నిధులను అందింపచేస్తోందని, ఇది ఆషామాషీ వ్యవహారం కాదని దత్తపీఠంలో పలువురు దత్త పీఠ పండిత ప్రముఖులు పేర్కొనడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతాపార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి కె.గీతామూర్తి సమర్పణలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా వినూత్న రీతిలో రూపుదిద్దుకున్న ‘శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ సుమారు మూడువందల యాభైపేజీల దివ్య గ్రంధాన్ని ఆమె స్వయంగా ఎందరో ఆరెస్సెస్ మరియు బీజేపీ మహిళా శ్రేణులకు, నాయకులకు ఇవ్వడం ఇప్పటికే ప్రాధాన్యత సంతరించుకుంది.