జాతీయ అవార్డు పొందిన కలర్ ఫొటోలాంటి చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ రాజ్… ఇసారి కేవలం కథ.. స్క్రీన్ ప్లే… మాటలు మాత్రమే అందంచిన చిత్రం ముఖ చిత్రం. ఈ చిత్రానికి పలు చిత్రాలకు రచయితగా, దర్శకత్వ శాఖలో పనిచేసి అనుభం సాధించిన యువ దర్శకుడు గంగాధర్ దర్శకత్వం వహించారు. ఇందులో సినిమా బండి హీరో వికాస్ వశిష్ట హీరోగా నటించగా… హుషారు హీరోయిన్ ప్రియ వడ్లమాని, ఉత్తరాది భామ ఆయేషా ఖాన్ లు హీరోయిన్లుగా నటించారు. యువ నటుడు చైతన్య రావ్ ఓ ముఖ్య పాత్రలో నటించగా… విశ్వక్ సేన్ లాయర్ పాత్ర పోషించారు. ఈ చిత్రానికి ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మాతలు. పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.కె.ఎన్. సమర్పణ. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం పదండి.
కథ: రాజ్ కుమార్(వికాస్ వశిష్ట) ఒక ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్. తన తల్లి ఓ యాక్సిడెంట్ లో అందాన్ని కోల్పోయి… మానసిక వ్యథతో చనిపోతుంది. దాంతో అలా ఎవరూ చనిపోరాదని… ప్రమాదాల్లో అందం కోల్పోయిన వారికి ఓ భరోసా ఇవ్వాలనే పట్టుదలతో మంచి ప్లాస్టిక్ సర్జన్ అవుతాడు. అదే సమయంలో మహతి(ప్రియ వడ్లమాని) అనే ఓ గ్రామీణ యువతిని ప్రేమించి పెళ్లాడుతాడు. అయితే రాజ్ ను తన క్లాస్ మేట్ అయిన మాయ(ఆయేషా ఖాన్) ప్రాణంగా ప్రేమిస్తూ వుంటుంది. రాజ్… మహతిని వివాహం చేసుకోబోతున్నాడని తెలిసి చాలా బాధపడి… వెంటనే తేరుకుని మామూలుగా తన పనేదో తను చేసుకుని ఫ్రెండ్లీగా వుంటూ వస్తుంది. అయితే అనుకోకుండా ఓ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి ముఖం అంతా ఛిద్రం అవుతుంది మాయకు. అదే సమయంలో మహతి కూడా ప్రమాదవశాత్తు కళ్లు తిరిగి కిందపడి ప్రాణాలు కోల్పోతుంది. తనకి ఎంతో ఇష్టమైన భార్య ముఖాన్ని… ఛిత్రమైన మాయ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి మహతిగా మారుస్తాడు రాజ్. మరి ఇలా మహతిగా మారిన మాయ… రాజ్ గురించి ఎలాంటి నిజాలు తెలుసుకుంది? మహతిని నిజంగానే రాజ్ బాగా చూసుకున్నాడా? చివరకి వీరిద్దరి మధ్య వున్న స్నేహం ఎలాంటి మలుపులు తీసుకుందనేది తెలియాలంటే సినిమా చూడాల్పిందే.
నటీనటులు ఎలా నటించారు అంటే…
ఇందులో వికాస్ వశిష్ట… ప్లాస్టిక్ సర్జన్ పాత్రలో బాగా ఒదిగిపోయి నటించాడు. అతని పాత్రలో వున్న వేరియేషన్స్ ని బాగా చూపించి ఆకట్టుకుంటాడు. తన మిత్రునిగా నటించిన చైతన్య రావు పాత్ర పర్వాలేదు. తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఫిమేల్ లీడ్ పాత్రల గురించి. ఇందులో చేసిన ప్రియా వడ్లమాని, ఉత్తరాది అమ్మాయి ఆయేషా ఖాన్… పోటీ పడి నటించారు. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన గ్రామీణ యువతి పాత్రలో ప్రియ వడ్లమాని, ఆధునిక బావాలతో జాలీగా ఎంజాయ్ చేసే అమ్మాయి పాత్రలో ఆయేషా ఖాన్… చక్కగా నటించింది. రెండు వేరియేషన్స్ లో ప్రియ వడ్లమాని చక్కగా నటించింది. చివర్లో లాయర్ విశ్వామిత్ర పాత్రంలో విశ్వక్ సేన్ మెరుపులా కనిపించి… ఆకట్టుకున్నాడు. అలాగే డైలాగ్ కింగ్ సాయి కుమార్ సోధరుడు రవిశంకర్ కూడా సీనియర్ న్యాయవాది పాత్రలో కనిపించి మెప్పించారు. వీరిద్దరి మధ్య వచ్చే క్లైమాక్స్ సీన్ పీక్స్ లో ఉంటుంది.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే…
కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్… ఈ చిత్రానికి అందించిన కథ… కథనాలు కొత్తగా వున్నాయి. అందుకు తగ్గట్టు రాసుకున్న సంభాషణలు చాలా నాచురల్ గా వున్నాయి. రచయిత రాసిని కథ.. కథనాలను దర్శకుడు గంగాధర్ చక్కగా వెండితెరపై ఆవిష్కరించి విజయం సాధించారు. మొదట్లో కొంచెం కథనం స్లోగా సాగినా… ఆ తరువాత వేంగంగా ముందుకు నడిపించడంలో దర్శకుడు తన ప్రతిభను చాటుకున్నాడు. దానికి తోడు సినిమాటోగ్రఫీ కూడా అందంగా చూపించడంలో కీలక పాత్ర పోషించింది. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా వుంది. రన్ టైం కూడా రెండు గంటలే కావడంతో సినిమా ఎక్కడా బోరింగ్ అనిపించదు. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగానే చాలా క్వాలిటీగా వున్నాయి.
కథ… కథనం విశ్లేషణ: సినిమా ప్రారంభ దశ నుంచే ఓ క్యూరియాసిటీని రేకెత్తించే మీటర్లో నడిపించే క్రమం ఆకట్టుకుంటుంది. ఇందులో ఎవరు ఏమిటన్నది ప్రీ క్లైమాక్స్ దాకా ఓ సస్పెన్స్ డ్రామాతో నడిపించడం ఇంట్రెస్టింగ్ గా వుంది. ఆది నుంచే పాత్రలన్నీ ఓ సాఫ్ట్ కార్నర్ లో ప్లే కావడం… ఎక్కడా ఎలాంటి సందేహాలు రాకుండా అన్ని పాత్రలనూ ఈక్వల్ గా …. ఇంటర్వెల్ దాకా చూపించడం వల్ల సినిమాలో అసలు ట్విస్ట్ ఏంటనే సస్పెన్స్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. మనం నిత్యం భార్య భర్తల మధ్య తలెత్తే ఓ సున్నితమైన అంశాన్ని క్లైమాక్స్ లో హైలైట్ చేసి… ఓ మెసేజ్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నం అభినందనీయం. అయితే క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సీన్ ఇంకాస్త ఆసక్తికరంగా వుండి వుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో హీరో.. హీరోయిన్ల మద్య సరదాగా సాగే సీన్స్ తో కథనాన్ని ముందుకు నడిపంచి… ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకూ ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆలోచించడానికి వీలు లేని స్క్రీన్ ప్లేతో చివరి వరకు సినిమాను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. భార్య భర్తల మధ్య ఎలాంటి బంధం వుండాలి? అలాగే స్నేహితుని భార్య పట్ల … ఫ్రెండ్స్ ఎలాంటి భావనతో వుండకూడదో అనే అంశాలను చాలా సున్నితంగానే చూపించి సక్సెస్ అయ్యారు. మనం నిత్యం మన చుట్టు పక్కల చూసే సాధారణ విషయాలనే… ఇందులో ఓ మెసేజ్ రూపంలో ఇవ్వడం ఔరా అనిపిస్తుంది. వీటికి కూడా చట్టంలో ఎలాంటి స్థానం వుందో అనేది సెక్షన్లతో సహా వివరించి… ఆడియన్స్ కి ఓ సందేశం అయితే ఇవ్వడానికి ప్రయత్నించింది మూవీ టీమ్. అందుకు వారిని అభినందించి తీరాల్సిందే. ఈ వీకెండ్ లో సరదాగా చూసేయండి…!!!
రేటింగ్: 3.25