ఆర్అండ్‌డీ మరియు ఇన్నోవేషన్ ఆధారిత అంతర్జాతీయ తయారీ దిగ్గజం డోర్ఫ్-కెటల్ కెమికల్స్ ఇండియా లిమిటెడ్ (Dorf-Ketal Chemicals India Limited) తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కి (ఐపీవో) సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి (సెబీ) సమర్పించింది. దీని ప్రకారం ఐపీవో కింద రూ. 1,500 కోట్ల వరకు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, రూ. 3,500 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డరయిన మీనన్ ఫ్యామిలీ హోల్డింగ్స్ ట్రస్ట్, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనుంది. మొత్తం మీద ఇష్యూ పరిమాణం రూ. 5,000 కోట్లుగా ఉంటుంది. ఒక్కో షేరు ముఖ విలువ రూ. 5గా ఉంటుంది. 1992లో ఏర్పాటైన డోర్ఫ్-కెటల్ కెమికల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ భారత్‌లో స్పెషాలిటీ కెమికల్స్ అభివృద్ధి, విక్రయానికి సంబంధించి అతి పెద్ద తయారీ సంస్థల్లో ఒకటిగా కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రధానంగా హైడ్రోకార్బన్స్ కోసం స్పెషాలిటీ కెమికల్స్ మరియు ఇండస్ట్రియల్ స్పెషాలిటీ కెమికల్స్‌ను అందిస్తోంది. 2024 అక్టోబర్ 31 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్, పెట్రోనాస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, పీపీజీ ఇండస్ట్రీస్, క్లారియంట్, లిబర్టీ ఎనర్జీ, ఇటాలియానా పెట్రోలి, వేదాంత మొదలైన సంస్థలు కస్టమర్లుగా ఉన్నాయి. సెప్టెంబర్ 30 నాటికి కంపెనీకి 1,322 కస్టమర్లు ఉన్నారు.
డీఆర్‌హెచ్‌పీ లింకు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అక్టోబర్ 31 నాటికి కంపెనీకి భారత్‌లో ఎనిమిది ప్లాంట్లతో పాటు అమెరికా, బ్రెజిల్, కెనడా సహా మొత్తం నాలుగు దేశాల్లో 16 తయారీ ప్లాంట్లు ఉన్నాయి. భారత్‌లోని ప్లాంట్ల స్థాపిత సామర్ధ్యం 1,47,770 MTPAగా, మిగతా దేశాల్లోని ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం 1,94,770 MTPAగా ఉంది. 2022 – 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఆదాయం వార్షికంగా 45.47 శాతం పెరిగి రూ. 54,795 మిలియన్లకు, లాభం (PAT) 50.18 శాతం వృద్ధితో రూ. 6,020 మిలియన్లకు చేరింది. జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, జేపీ మోర్గాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మోర్గాన్ స్టాన్లీ ఇండియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్ ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.