జీవితం చాలా గొప్పది. అందుకే జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఎదురొడ్డి పోరాడాలి. చిన్న చిన్న కష్టాలకే జీవితం వ్యర్థమని భావించకుండా గొప్పగా బతకాలి. పదిమందికీ ఆదర్శంగా జీవించాలి. దానికి మనలోని లోపాలు ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డంకి కాకుండా చూసుకోవాలి. ఈ విషయాలను అక్షరాలా నిజం చేసి చూసిస్తున్నాడు. బ్రెజిల్‌కు చెందిన క్లాడియో వియెరా డీ ఒలీవిరా. ఒలీవిరా పుట్టుకతోనే ఆర్త్రోగ్రిపోసిస్ మల్టీప్లెక్స్ కాన్‌జెనీటా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. అతడి కాలి కండరాలు బలహీనంగా ఉండడంతో కాళ్లు చచ్చుబడిపోయాయి. అలాగే అతడి చేతులు ఛాతీకి అతుక్కుపోయి ఉండడం, తల కూడా వెనక్కి వంగిపోయి తలకిందులుగా మారడంతో పుట్టినప్పుడే అతడి శరీరం చాలా వికృతంగా ఉంది. డాక్టర్లు కూడా ఆ శిశువును చూసి 24 గంటల కంటే ఎక్కువ కాలం బతకడని తేల్చి చెప్పారు. అతడికి ఆహారం కూడా ఇవ్వవద్దని, ఇలా బతకడం దుర్భరంగా ఉంటుందని, భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడని హెచ్చరించారు. అంటే ఆ శిశువును చంపేయమనే ఉద్దేశంలో డాక్టర్లు సేతం సలహాలిచ్చారు.
కానీ అతడి తల్లి దీనికి అంగీకరించలేదు. తన బిడ్డను తాను చూసుకుంటానని చెప్పి ఇంటికి తెచ్చుకుంది. అప్పటి నుంచి కొడుకును కంటికి రెప్పలా కాపాడుకుంది. అతడే ఇప్పుడు మనం చూస్తున్న44 ఏళ్ల ఒలీవిరా. ఈ క్రమంలోనే అతడు మాట్లాడుతూ.. తనకు చనిపోవాలని లేదని, మరిన్ని సంవత్సరాలు బతకాలని ఉందని అంటున్నాడు. ‘ఇలా బతకడానికి నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు. అందరిలా సాధారణంగానే జీవించాను. ఇంకా చాలా సంవత్సరాలు బతకాలని అనుకుంటున్నాను’ అని ఒలీవిరా చెప్పుకొచ్చాడు.
అర్త్రొగ్రిపోసిస్ మల్టీప్లెక్స్ కాంజెనీటా వ్యాధివల్ల మనిషి శరీరంలో కీళ్లు దెబ్బతింటాయి. శరీరంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ కీళ్లపై దీని ప్రభావం ఉంటుంది. దీని ప్రభావానికి లోనైన కీళ్లు పూర్తిగా ముడుచుకుపోవడం కానీ, లేదా నిటారుగా ఆగిపోవడం కానీ జరుగుతుంది. దీనివల్ల ఆ కీళ్లు ఏ మాత్రం పనిచేయవు. దీంతో శరీరంలో అనేక రుగ్మతలకు తలెత్తుతాయి. అయితే ఇంతటి వింత వ్యాధితో బాధపడుతున్నప్పటికీ తనతో పాటు చుట్టుపక్కల వారిని చైతన్యపరిచేందుకు ఒలీవిరా ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే ఎన్నో పబ్లిక్ స్పీచ్‌లలో పాల్గొని జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలో చెబుతుంటాడు. బ్రెజిల్ లోని బహియా ప్రాంతంలో ఒలీవిరా నివశిస్తున్నాడు. అయితే కరోనా నేపథ్యంలో అతడు గతేడాది నుంచి ఇంటికే పరిమితమైపోయాడు. కానీ, ఈ మహమ్మారి బాధ వదిలిపెట్టగానే తాను మళ్లీ బయటకెళతానని అనేకచోట్ల స్పీచ్‌లు ఇస్తానని ఒలీవిరా చెబుతున్నాడు.