టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో బౌలింగ్ చేయించకపోవడం జట్టు వ్యూహంలో భాగమేనని జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరించాడు. రాబోయే ఇంగ్లండ్ టూర్‌కు ఫిట్‌గా ఉంచాలనే నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కోహ్లీ.. హార్దిక్ గురించి కీలక విషయాలను బయటపెట్టారు. ‘త్వరలో టీమిండియా ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. ఈ క్రమంలోనే హర్దిక్ పూర్తి ఫిట్‌గా ఉండాలని భావిస్తున్నాం. అందుకే అతడిపై ఎక్కువ ఒత్తిడి పెట్టాలని భావించడం లేదు. పాండ్యాతో బౌలింగ్ వేయించకుండా ఉండడానికి కూడా అదే కారణం’ అని కోహ్లీ వివరించాడు.
కాగా.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు. దీంతో క్రికెట్ అభిమానులంతా టీమిండియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్దిక్ చేత ఎందుకు బౌలింగ్ చేయించలేదని ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు టీ20 సిరీస్‌లో హార్దిక్ చక్కగా బౌలింగ్ చేశాడు. ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌ను చక్కగా కట్టడి చేశారు. అయితే వన్డే సిరీస్‌లో మాత్రం హార్దిక్ ఒక్క ఓవర్ కూడా వేయలేదు. దీంతో కోహ్లీ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటాడంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ వివాదంపై నోరు విప్పాడు. పాండ్యాను పక్కన పెట్టడానికి గల కారణాన్ని మీడియా ముందు వివరించి అందరికీ క్లారిటీ ఇచ్చాడు.
ఇదిలా ఉంటే కొద్ది నెలల క్రితం ఆసీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలోనూ కోహ్లీ.. హార్దిక్‌తో ఎక్కువగా బౌలింగ్ చేయించలేదు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం హార్దిక్ చక్కగా ఆడుతున్నాడు. జట్టుకు కీలక సమయాల్లో అత్యుత్తమ పరుగులు రాబడుతూ విజయాల్లో కీరోల్ పోషిస్తున్నాడు.