దేశంలో కరోనా థర్డ్ వేవ్ అడుగుపెట్టేసింది. మహారాష్ట్రలో వేల మంది చిన్నారులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో చిన్నారులపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక తాజాగా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఏకంగా వేల సంఖ్యలో చిన్నారులు కరోనా బారిన పడ్డారు. 8 వేల మందికి పైగా చిన్నారులకు కోవిడ్ సోకడంతో స్థానికంగా ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే ఆ చిన్నారులందరికీ చికిత్స అందించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా ఓ కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు.
జిల్లాలో థర్డ్‌వేవ్ పరిస్థితులపై కలెక్టర్ స్పందించారు. వైరస్ సోకిన చిన్నారులకు చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్కూల్ వాతావరణాన్ని తలపించేలా కరోనా వార్డులను సిద్ధం చేస్తున్నామని అన్నారు. జిల్లాలోని చిన్నారుల్లో 10శాతం మందికి కరోనా కేసులు నమోదయ్యాయని, అందుకే థర్డ్ వేవ్ నుంచి పిల్లలను రక్షించుకునేందుకు చిన్న పిల్లల వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. స్థానిక కార్పొరేటర్ అభిజిత్ భోశ్లే మాట్లాడుతూ.. మే నెలలో 8వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని, థర్డ్‌వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
కాగా.. కరోనా థర్డ్‌వేవ్‌లో వైరస్ మహమ్మారి చిన్నారులను టార్గెట్ చేస్తుందని నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు ముందస్తుగా నియంత్రణ చర్యలను సైతం ప్రాంరభించాయి. ముఖ్యంగా చిన్నారులు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు వైద్యాధికారులు పలురకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా థర్డ్‌వేవ్ క్రమంగా వ్యాప్తిస్తూ చిన్నారులను కబళిస్తోంది.