హైదరాబాద్: రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీ వెళ్లిన ఈటల అక్కడ టీ-బీజేపీ నాయకులతో కలిసి జాతీయ నాయకులను కలుస్తారని, వారి సమక్షంలోనే బీజేపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఎట్టకేలకు బీజేపీ స్పందించింది. ఆ పార్టీ నేత, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలనను ఎదుర్కోవటానికే పార్టీని బలోపేతం చేస్తున్నామని, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తమ పార్టీ పెద్దలను కలవడం అందులో భాగమేనని కిషన్ రెడ్డి చెప్పారు. నియంత కేసీఆర్‌ను గద్దె దించటానికి అందరూ కలసి రావాలని పిలుపునిచ్చారు.
కిషన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈటల బీజేపీలో చేరడంపై కూడా స్పందించారు. ఢిల్లీలో ఈటల రాజేందర్ తమ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుస్తారని, తనతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో చర్చించిన తర్వాతే ఈటల ఢిల్లీ బయలుదేరారని, ఈటల చేరికను పార్టీ ముఖ్యనేతలతోపాటు అంతా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారని చెప్పారు.
ఇక పార్టీలో ఉన్న అసంతృప్తుల గురించి మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి విమర్శలపై స్పందించేందుకు నిరాకరించారు. పార్టీలో సానుకూల వాతావరణమే ఉందని పేర్కొన్నారు. పార్టీలో అసంతృప్తులు సహజమని, సీనియర్ నేత పెద్దిరెడ్డి అసంతృప్తిని పార్టీ అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకుంటుందని తెలిపారు. అంతర్గత అంశాలు బయటకు చెప్పాల్సిన అవసరం లేదని, పెద్దిరెడ్డి తనను విమర్శించినప్పటికీ తాను కూడా స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.