కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు వరంలా మారింది. రోగుల బతుకు ఆశను కామధేనువుగా మార్చుకుంటున్నాయి. ఆక్సిజన్‌తో పాటు రెమ్‌డెసివిర్ మందు కూడా తెచ్చుకుంటేనే రోగిని చేర్చుకుంటున్నాయి. రూ.లక్షల్లో అడ్వాన్స్ అడుగుతున్నాయి. ఇలా అన్నీ బయటనుంచి తెచ్చుకున్నా ఆస్తులు అమ్ముకునే స్థాయిలో బిల్లులు వేస్తున్నాయి. కరోనా రోగుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు అధిక బిల్లులు వేస్తున్నాయంటూ వైద్య ఆరోగ్య శాఖ వాట్సాప్‌నకు పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర సర్కార్ అలాంటి ఆసుపత్రులను ఏరివేసే పనిలో పడింది. ఇప్పటికే అనేక ఆసుపత్రులను గుర్తించి ఆ ఆసుపత్రుల కోవిడ్ చికిత్స లైసెన్సులను రద్దు చేసింది. తాజాగా ఈ రద్దు జాబితాలో మరో 6 ఆసుపత్రులు చేరాయి.
ఆ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స రద్దు చేస్తూ తెలంగాణ ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలు, కొవిడ్ ప్రోటోకాల్ పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కరోనా వైద్యానికి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన అధికారులు.. ఆ ఆరోపణలన్నీ నిజమేనని తేలడంతో ఆయా ఆస్పత్రులకు కొవిడ్ చికిత్స లైసెన్స్ రద్దు చేశారు. లైసెన్స్ రద్దయిన ఆసుపత్రుల్లో వాటిలో పద్మజ ఆస్పత్రి (కేపీహెచ్‌బీ కాలనీ), లైఫ్‌లైన్ మెడిక్యూర్ (అల్వాల్), టిఎక్స్ ఆస్పత్రి (ఉప్పల్), మ్యాక్స్ కేర్ ఆస్పత్రి (హన్మకొండ), లలిత ఆస్పత్రి (వరంగల్), శ్రీసాయి రాం ఆస్పత్రి (సంగారెడ్డి) ఉన్నాయి.
కొవిడ్ బాధితుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సర్కారు చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 105 ఆస్పత్రులపై 166 ఫిర్యాదులు వచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఫిర్యాదులపై విచారణ చేపట్టి, సంబందిత ఆస్పత్రులకు షోకాజు నోటీసులు కూడా జారీ చేశామని వైద్యారోగ్య శాఖ తెలిపింది. షోకాజు నోటీసులు అందిన తర్వాత 24 గంటల్లోపు సరైన వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో ఆస్పత్రి లైసెన్సును రద్దుచేస్తామని హెచ్చరించింది. మరోవైపు ఇప్పటి వరకు 16 ఆస్పత్రుల లైసెన్సులను రద్దు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.