హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరే ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జూన్ 13వ తేదీన బీజేపీ కండువా కప్పుకునేందుకు ఆయన రెడీ అయ్యారు. అయితే ఇటీవలే ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి ,టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సరిగ్గా వారం రోజుల్లో.. అంటే వచ్చే ఆదివారం.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకోనునట్లు సమాచారం.
కాగా.. బీజేపీలోకి ఈటలను తీసుకునేందుకు రాష్ట్ర కార్యవర్గం చాలా తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలోనే గత వారం బీజేపీ రాష్ట్ర నేతలు ఈటలను ఢిల్లీ తీసుకెళ్లారు. అక్కడ నడ్డాను కలిసి మాట్లాడించారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. దీంతో ఈటల బీజేపీలో చేరడం ఖరారు కాగా.. ఎప్పుడు చేరతారనేదే ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా ఆ ప్రశ్నలకు కూడా క్లారిటీ వచ్చింది.
కాగా.. ఈటల రాజేందర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్ జెడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ తుల ఉమాతో పాటు మరికొంతమంది ముఖ్యనాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు.