జూన్ 18 నుంచి ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఆ తర్వాత ఆగస్టులో ఇంగ్లండ్ జట్టుతో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలోనే 3 రోజుల కఠిన క్వారంటైన్ తర్వాత విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు రోజ్ బౌల్ మైదానంలో ప్రాక్టీస్ ప్రారంభించింది. శనివారంతో క్వారంటైన్ ముగియడంతో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా తదితర ఆటగాళ్లు ఆదివారం ప్రాక్టీస్ ప్రారంభించారు. దాదాపు 3 వారాల తర్వాత టీమిండియాకు ఇదే మొదటి ట్రైనింగ్ సెషన్ కావడంతో హుషారుగా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.
స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘సౌతాంప్టన్‌లో ఫస్ట్ ప్రాక్టీస్’ అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ జోడించాడు. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి అడుగుపెట్టిన యువ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా సీరియస్‌గా బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఇక మిగతా ఆటగాళ్లు కూడా నెట్స్‌లో బిజీగా గడిపారు.
First outing in southampton🙌 #feelthevibe #india pic.twitter.com/P2TgZji0o8
— Ravindrasinh jadeja (@imjadeja) June 6, 2021
కాగా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం జూన్ 2న ఇంగ్లండ్ బయలుదేరింది. అంతకుముందు ముంబైలో రెండు వారాల పాటు కుటుంబ సభ్యలతో కలిసి క్వారంటైన్‌లో ఉంది. 3వ తేదీన ఇంగ్లండ్ చేరుకున్న టీమిండియా అప్పటి నుంచి సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియం పరిధిలో ఉన్న హోటల్‌లోనే బస చేసింది. అక్కడే 3 రోజుల పాటు ఎవరి హోటల్ గదుల్లో వారు క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ క్వారంటైన్ శనివారంతో ముగియడంతో ఎట్టకేలకు మైదానంలోకి దిగి సాధన మొదలుపెట్టింది.