హైదరాబాద్: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. సెకండ్ వేవ్ కారణంగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని, అందువల్లే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నామని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటికే రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, టెన్త్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా.. ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన గ్రేడ్‌ల ప్రకారమే రెండో సంవత్సరం గ్రేడింగ్ కూడా ఉంటుందని తెలిపింది.
తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఫలితాలకు సంబంధించి త్వరలోనే విధివిధానాలను రూపొందిస్తామని చెప్పారు. కమిటీ వేశామని, కమిటీ నిర్ణయం మేరకు ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్ణిలె ఉంచుకుని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నానని, ఆయన ఆదేశాలతోనే ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
కాగా.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను కూడా ఏప్రిల్‌లో రద్దు చేశారు. ఆ తర్వాత గ్రేడింగ్ విధానం ద్వారా విద్యార్థులను పాస్ చేశారు. ఇప్పుడు కూడా అదే విధానంలో విద్యార్థులను పాస్ చేయనున్నట్లు తెలుస్తోంది.