టోక్యో: ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్ గేమ్స్ జరగడం ఈ ఏడాది అనుమానంగా మారింది. ఈ దఫా ఆతిథ్యం ఇవ్వాల్సిన జపాన్.. కరోనా నాలుగో వేవ్ కారణంగా అల్లకల్లోలం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. దీనికి తోడు ఒలింపిక్ క్రీడలు నిర్వహించాల్సిన జపాన్ రాజధాని టోక్యోలోనూ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రధాని యోషిహిడే సూగా టోక్యోతో పాటు మరో 8 నగరాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. టోక్యో, ఒసాకా, క్యోటో, హ్యోగో, ఐచి, ఫ్యుకోకా, హొక్కైదో, ఒకాయామ, హిరోషిమా నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జూలైలో ఒలింపిక్ గేమ్స్ నిర్వహించడం జపాన్‌కు సాధ్యం కాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మార్చి నెల వరకు జపాన్‌లో వారానికి సగటున 1000 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా ఆ సంఖ్య 4,449కి పెరిగింది. ప్రతి రోజూ 4000వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా 7లక్షల కేసులు నమోదయ్యాయి. 12వేలకు పైగా మరణాలు సంభవించాయి. దీంతో జపాన్‌లోని అనేక నగరాల్లో వైద్య వ్యవస్థ స్తంభించింది.
ప్రపంచ దేశాలతో పోల్చితే జపాన్‌పై కరోనా వైరస్ వరుసగా దాడులు చేస్తోంది. ఈ మధ్యనే మూడోవేవ్ దాడి పూర్తికాగా.. గత నెల నుంచి నాలుగో వేవ్ ప్రారంభమైంది. జపాన్‌పై కరోనా ప్రభావం ఈ స్థాయిలో ఉండడానికి కారణం వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగడమే. అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యంత ఆలస్యంగా వ్యాక్సినేషన్ మొదలై.. చాలా నెమ్మదిగా సాగుతున్న దేశం జపాన్. ఫిబ్రవరిలో వ్యాక్సినేషన్ మొదలు కాగా.. ఇప్పటివరకు అక్కడ కేవలం 2.4 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం మాస్ వ్యాక్సినేషన్ క్యాంపెయినింగ్ ప్రారంభించింది. జూలై చివరికల్లా దేశంలోని 65ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. అప్పటికి ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కావల్సిఉంది. వ్యాక్సినేషన్ పూర్తికాకుండానే ఒలింపిక్ గేమ్ష్ ప్రారంభం అవుతాయా..? లేదా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.