రోహిత్-ధవన్ ఓపెనింగ్ జోడీ ఎంతబాగా సక్సెస్ అయిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వన్డేల్లో టీమిండియాకు దొరికిన అత్యద్భుతమైన ఓపెనింగ్ జోడీలో ఇది కూడా ఒకటి. తాజాగా ఈ జోడీ ఓ అరుదైన రికార్డు సాధించింది. టీమిండియా తరపున మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఓపెనింగ్ పెయిర్‌గా సచిన్-గంగూలీల తర్వాతి స్థానానికి రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ చేరారు. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా రోహిత్-ధవన్ ఓపెనర్లుగా వన్డేల్లో 5000 పరుగులు పూర్తి చేశారు. దీంతో వన్డేల్లో ఈ ఘనత సాధించిన 7వ ఓపెనింగ్ జోడీగా రోహిత్-ధవన్ రికార్డులకెక్కారు.
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా సచిన్ టెండుల్కర్ – సౌరవ్ గంగూలీ ఉన్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 8,227 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి తరువాత స్థానాల్లో శ్రీలంక ఓపెనింగ్ జోడీ సంగక్కర – జయవర్దనే (5,992 పరుగులు), దిల్షాన్-సంగక్కర (5,475), జయసూర్య-ఆటపట్టు (5,462), ఆసీస్ ఓపెనర్లు గిల్‌క్రిస్ట్ – మాథ్యూ హేడెన్ (5,409), విండీస్ పెయిర్ గ్రీనిడ్జ్ - హేన్స్ (5206) ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో
రోహిత్-శిఖర్ జోడీ కూడా చేరింది.
ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 48.2 ఓవర్లలో 329 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్
రిషబ్ పంత్(78: 62 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు) అత్యధిక పరుగలు చేశాడు. ఆ తర్వాత శిఖర్ ధవన్(67), హార్దిక్ పాండ్యా(64: 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు) అర్థ
సెంచరీలతో రాణించారు. అనంతరం 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి చవి చూసింది. చివర్లో బౌలర్ శామ్ కర్రార్(95) మెరుపులు మెరిపించడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే డెత్ ఓవర్లలో పాండ్యా, నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో విజయం టీమిండియా వశమైంది.