హైదరాబాద్, మే 20: నాలుగు వందల పేజీల పవిత్ర సంపద, అత్యద్భుతమైన దైవీయ చైతన్యం, అపురూపమైన రమణీయ వ్యాఖ్యానం, అపూర్వమైన పురాణేతిహాస కథా వైవిధ్యం, గ్రహపీడల్ని తేలికగా నియంత్రించి తొలగించే భక్తి స్తోత్రాలు, ప్రతీ పేజీలో ప్రజ్వలించే మంత్రశక్తులు.. ప్రతీ అక్షరమూ కాంతిమయమేనన్నారు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె, తెలంగాణ శాసనమండలి సభ్యురాలు శ్రీమతి సురభి వాణీదేవి. ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ఆరాధన పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుత రచనా సంకలనం శ్రీమాలిక గ్రంధం పదహారవ పునర్ముద్రణను హైదరాబాద్ త్యాగరాయగాన సభలో ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీమతి వాణీదేవి మాట్లాడుతూ ఈ మహా గ్రంధంలో తిరుమల గిరుల పారవశ్యాలు, నృసింహ ఆవిర్భావ ఘట్టాల కథలు చదువుతుంటే వొళ్ళు గగుర్పొడుస్తోందని.. పురాణపండ శ్రీనివాస్ రచనా శైలీవిన్యాసంలోని రమణీయత, కమనీయత భక్తి నిండిన మనస్సుకే ఇంజెక్ట్ అవుతుందని ప్రశంసలు వర్షించారు.
సభకు అధ్యక్షత వహించిన శృంగేరి మహాసంస్థానం వారి శ్రీ జ్ఞానసరస్వతీ దేవస్థానం ధర్మాధికారి కే. జనార్ధనమూర్తి మాట్లాడుతూ.. ఓ మహోదాత్త పవిత్ర సంకల్పంతో ఈ శ్రీమాలిక గ్రంధం కేవలం మొదట నూట అరవై పేజీలతో మొదలై.. ఇప్పుడు పదహారవ పునర్ముద్రణ నాలుగువందల పేజీల రామణీయకత్వంతో శోభిల్లడం వెనుక పురాణపండ శ్రీనివాస్ అకుంఠిత కృషి, మేధ, విరామమెరుగక పరిశ్రమించే నిస్వార్ధత, అసాధారణ ప్రతిభ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని అభినందించారు.
శ్రీమాలిక పవిత్ర గ్రంథ రచనా సంకలనకర్త, విఖ్యాత ఆధ్యాత్మిక ప్రచురణల సంస్థ జ్ఞానమహాయజ్ఞకేంద్రం ఫౌండర్ చైర్మన్ పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆపదలను దూరంచేసే ఈ మనోహరమైన మంత్రాల మాటున తిరుమల వేంకట నారాయణుని మంగళానుగ్రహం ఉందనేది నిరూపితమైందని వివరంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో వంశీ సంస్థల చైర్మన్ వంశీరామరాజు, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, త్యాగరాయగానసభ సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి చక్రపాణి, పాలకవర్గ సభ్యురాలు గుండవరపు సీతాదేవి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.