ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో గెలవడంతో టీమిండియా చెమటోడ్చి గెలిచిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ బౌలర్ శామ్ కర్రాన్(95 నాటౌట్) విజృంభించి ఆడడంతో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. అయితే శామ్ కర్రాన్ ఆటతీరుకంటే టీమిండియా విజయాన్ని దెబ్బ తీసిన మరో అంశం ఫీల్డింగ్ వైఫల్యం. సునాయాసంగా చేతికందిన క్యాచ్‌లను అందుకోలేకపోయారు. కనీసం 10 గజాల దూరం నుంచి కూడా వికెట్లకు డైరెక్ట్ త్రో విసరలేకపోయారు. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ, నటరాజన్.. అంతా చేతికొచ్చిన క్యాచ్‌లను అందుకోలేకపోయారు. ఇక కేఎల్ రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణలు వికెట్లకు బంతి కూడా విసరలేకపోయారు. కోహ్లీ ఒక్కడే అద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌లోనే హైలెట్ క్యాచ్ అందుకున్నాడు.
ఫీల్డింగ్‌లో టీమిండియాకున్న మంచి ఫీల్డర్లలో హార్దిక్ పాండ్యా కూడా టాప్‌లో ఉంటాడు. కానీ ఈ మ్యాచ్‌లో అతీడు రెండు సులభమైన క్యాచ్‌లను జారవిడిచాడు. జట్టుతో పాటు అందరినీ విస్మయానికి గురి చేశాడు. విధ్వంసక ఆటగాడు బెన్ స్టోక్స్ ఇచ్చిన సులభమైన క్యాచ్ ఒకటి కాగా.. రెండోది చివరి వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లిన శామ్ కర్రాన్‌ది. ఒకవేళ శామ్ ఇచ్చిన క్యాచ్ హర్దిక్ సక్రమంగా అందుకుని ఉంటే మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్లేదే కాదు. అయితే హార్దిక్ వల్ల లైఫ్ దొరికినా స్టోక్స్ వినియోగించుకోలేకపోయాడు. కొద్ది సేపటికే 37 పరుగుల వద్ద నటరాజన్ బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడబోయి థర్డ్ మ్యాన్ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ధవన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
కాగా.. మ్యాచ్ ముగిసిన తరువాత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఫీల్డింగ్ వైఫల్యంపై మాట్లాడాడు. తమ జట్టు ఫీల్డింగ్ విషయంలో అంత మంచి ప్రదర్శన చేయలేదని, అందుకే మ్యాచ్ ఇక్కడి వరకు వచ్చిందని కోహ్లీ అన్నాడు. అయితే టాప్ 2 జట్లు పోటీ పడుతున్నప్పుడు ఈ మాత్రం ఉత్కంఠ తప్పదని అతడు అభిప్రాయపడ్డాడు. వచ్చే టీ20 ప్రపంచకప్ నాటికి ఈ ఇబ్బందులను అధిగమించడమే లక్ష్యంగా ముందుకెళతామని పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్ ప్రస్తుత కెప్టెన్ బట్లర్ మాట్లాడుతూ.. టీమిండియాతో పాటు తమ జట్టు కూడా ఫీల్డింగ్‌లో తప్పులు చేసిందని, వాటిని సరిదిద్దుకోవడంపై దృష్టి సారిస్తామని అన్నాడు.