తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి వైసీపీపై ‘సై’ అంటూ తొడగొట్టి.. ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. ‘151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లను ప్రజలు ఎందుకిచ్చారు? రోడ్డుమీదకొచ్చే పిల్లల్ని చావగొడతాం, మీపై అట్రాసిటీ కేసులు పెడతాం… ప్రత్యర్థులకు ఓట్లేస్తే పథకాలు తీసేస్తాం అని బెదిరించేందుకా మీకు అధికారం ఇచ్చింది? సామాన్యులపైనా మీ ప్రతాపం…. దమ్ముంటే మీ ప్రతాపం పవన్ కల్యాణ్‌పై చూపండి! మీరు ఎలాంటి గొడవ పెట్టుకుంటారో పెట్టుకోండి… ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నా… దేనికైనా సై. వైసీపీ నాయకులకు ఇదే నా సవాల్!’ అంటూ పవన్ ఛాలెంజ్ చేశారు.
వైసీపీపై విమర్శలు..
‘ఏడాదిలోగా ఏపీ దశ, దిశ మారాలి. డబ్బుకు ఓటు కొనే పరిస్థితి పోవాలి. నేను పదవులు ఆశించను. అయితే నాకు సీఎం పదవి వస్తే మాత్రం అందరికంటే ఎక్కువగా పనిచేయగలను. నిజాయితీగా సేవ చేస్తాను. నేను అధికారం కోసం రాలేదు. నటుడ్ని అయ్యాను, ప్రజల అభిమానం సంపాదించుకున్నాను. ప్రజల గుండెల్లో ఉన్న స్థానం కంటే నాకు పెద్ద పదవి అక్కర్లేదు. గెలిచినా, ఓడినా తుది శ్వాస వరకు మీకోసమే పనిచేస్తా. నాకు వాణిజ్య ప్రకటనలు అక్కర్లేదు. నేను చేయను కూడా. నేను కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ ను కాను. ప్రజలకే బ్రాండ్ అంబాసిడర్‌ని. ఇప్పుడున్న జగన్ సర్కార్.. వైఎస్ వివేకా హత్య కేసును తేల్చలేని స్థాయికి దిగజారింది. నిందితులు మీకు తెలిసినా ఎందుకు పట్టించుకోవడం లేదు..?. సొంత చిన్నానను చంపినవారిని సీఎం జగన్ వెనకేసుకొస్తున్నారు. కోడి కత్తి కేసు ఏమైంది..? నిందితులను ఎందుకు పట్టుకోలేదు..? దేవుడి విగ్రహాల ధ్వంసం కేసు నిందితులను ఎందుకు పట్టుకోలేదు..?. ఈ ప్రభుత్వం ఎర్రచందనాన్ని చైనాకు డోర్ డెలివరీ చేస్తోంది’ అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నలు, విమర్శల వర్షం కురిపించారు.
రత్నప్రభను గెలిపించండి..
‘దేశం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు. ఓటు వేయడానికి గంటసేపు క్యూలో నిల్చోలేరా..?. వైసీపీ అభ్యర్థి గెలిస్తే ఢిల్లీ వెళ్లి ఏం చేస్తాడు..? మాట్లాడటానికి గొంతు కూడా రాదు. ఎంతో ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన రత్నప్రభ గారిని గెలిపించండి. ఏ పార్టీ ఏ అభ్యర్థిని నిలుపుకున్నా నాకు అభ్యంతరం లేదని, కానీ ఇక్కడ ఎవరిని గెలిపిస్తే లాభదాయకంగా ఉంటుందో ఓటర్లు ఆలోచించుకోవాలి. ఒకవేళ వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే ఢిల్లీ వెళ్లి ఏంమాట్లాడగలరు. ఇంతమంది ఎంపీల బలగం ఉండి కూడా వైసీపీ వాళ్లు ఏంసాధించలేకపోయారు. వెనుకటికి ఎవరో ఆర్నెల్లు కర్రసాము చేసి మూలన ఉన్న ముసలమ్మను కొట్టాడట’ అంటూ పవన్ ఛలోక్తి విసిరారు. శనివారం రాత్రి తిరుపతి లోక్‌సభ స్థానం అభ్యర్థి రత్నప్రభ తరఫున పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్.. పై విధంగా వాడీవేడిగా ప్రసంగించారు.