టీమిండియా – ఇంగ్లండ్ మధ్య ఇటీవల టెస్ట్, టీ20, వన్డే సిరీస్ లు జరిగిన విషయం తెలిసిందే. మూడు సిరీసులలోనూ టీమ్ ఇండియా విజయకేతనం ఎగరేసి ఇంగ్లాండ్ ను వట్టి చేతులతో యెహిరిగి పంపింది. అయితే ప్రస్తుతం టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ మూడో వన్డే ముందు చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.
తొలి రెండు వన్డేల్లో స్పిన్నర్లు తేలిపోవడంతో మూడో వన్డేకు రిజర్వు ఆటగాళ్లను ప్రయత్నించడంపై జాఫర్ ఈ ట్వీట్ చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి జాఫర్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘‘గుడ్ మార్నింగ్ కోహ్లీ. ఒక ఫొటో నీ ఉదయాన్ని మరింత ప్రకాశవంతం చేస్తుంది. అవును, ఇది నిజం. రేపటి మ్యాచ్‌కు నీకు గుడ్ లక్’’ అంటూ ఓ ఫొటోను షేర్ చేశాడు. అందులో.. ‘‘న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌లో గల గ్రీన్‌విచ్ గ్రామంలో ఉన్న వాషింగ్టన్ స్క్వేర్ పార్కులో వాలిపోతున్న పొద్దులో చెస్ ఆటగాళ్లు ఇదిగో ఇలా కూర్చున్నారు’’ అని రాసి ఉంది.
వసీం జాఫర్ ట్వీట్ పై అనేకమంది అభిమానులు స్పందించారు. యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాల్సిందిగా వసీం సూచిస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో మరికొందరు ‘మీ సీక్రెట్ మెస్సేజ్ సూపర్’ అంటూ వసీం చతురతను ప్రశంసిస్తున్నారు. అయితే వసీం ఈ ముగ్గురి పేర్లే ప్రస్తావించారని అంతా ఎందుకు భావిస్తున్నారంటే.. చాహల్ క్రికెటర్ అవడానికి ముందు చెస్ ప్లేయర్‌గా ఉండేవాడు. ఇక వాషింగ్టన్ పార్కు, సన్ ప్రస్తావన ద్వారా వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్ యాదవ్ పేర్లను గుర్తు చేశాడని అంటున్నారు.
ఇదిలా ఉంటే మూడో వన్డేపై జాఫర్ తో పాటు అనేకమంది స్పిన్నర్ల ఆటతీరుపై పెదవి విరిచారు. ఈ క్రమంలోనే టీమిండియా యాజమాన్యం కూడా జట్టులో ఓ మార్పు చేసి బరిలోకి దిగింది. కుల్దీప్ ను తొలగించి నటరాజన్ ను జట్టులోకి తీలుకుంది. కానీ జాఫర్ ఊహించినట్లు చాహల్, సుండర్లకు స్థానం లభించలేదు.