మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 కోసం క్రికెట్ లోకం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఫ్రాంచైజీలు కూడా ఈ మోగా టోర్నీ కోసం సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే పలు ప్రాంచైజీ సిబిరాల్లోని ఆటగాళ్లకు, సిబ్బందికి కరోనా సోకడం సంచలంగా మారింది. మొన్న కేకేఆర్, ఇప్పుడు ఢిల్లీ, చెన్నై. ఢిల్లీ కాపిటల్స్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కరోనా బారినపడ్డాడు. గత నెల 28న కొవిడ్ నెగటివ్ రిపోర్టుతో మంబైలోని టీం హోటల్‌లో అడుగుపెట్టిన అక్షర్ పటేల్‌కు తాజాగా రెండోసారి నిర్వహించిన కొవిడ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం వెల్లడించింది.
అక్షర్ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడని, వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తున్నారని ఢిల్లీ ఫ్రాంచైజీ తెలిపింది. ఏమాత్రం పరిస్థితి క్షీణిస్తే కనుక తప్పనిసరిగా ఆసుపత్రికి తరలించాల్సి ఉంటుందని, కోలుకున్న తర్వాత జట్టులో చేరడానికి ముందు తప్పనిసరిగా కార్డియాక్ స్క్రీనింగ్ చేస్తామని తెలిపింది. పటేల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపింది.
ఇక మరోవైపు సీఎస్‌కే సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్ సోకడం కలకర పరుస్తోంది. జట్టు సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్లు సీఎస్కె అధికారి ఒకరు తెలిపారు. ఈరోజు(శనివారం) నిర్వహించిన పరీక్షల్లో అతడికి కరోనా సొకినట్లు తేలిందని, ప్రస్తుతం పూర్తి ఐసోలేషన్‌లో ఉన్నాడని వెల్లడించారు. ‘కరోనా బారిన పడిన వ్యక్తి ఎక్కడికీ వెళ్లకపోవడమే కాకుండా ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్‌ని కూడా కలవలేదు. దాంతో మిగతా వారంతా సేఫ్. రేపు మా ప్రాక్టీస్ యథావిధిగానే ఉంటుంది’ అని సదరు అధికారి తెలిపారు.
కాగా.. కరోనా నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఏడాది టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అయింది. అయితే ఇప్పుడు ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండడం ఆందోళనగా మారింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఐపీఎల్ నిర్వహణ కష్ట సాధ్యం కావొచ్చనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. అయితే ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభం కానుంది.