జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంత్రి కొడాలి నాని దిమ్మదిరిగే కౌంటరిచ్చారు. శనివారం నాడు తిరుపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై తీవ్ర స్థాయిలో పవన్ విరుచుకుపడిన విషయం విదితమే. ఈ విమర్శలకు కృష్ణా జిల్లా గుడివాడలో మీడియా మీట్ నిర్వహించిన కొడాలి నాని.. పవన్ సంధించిన ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తూ కౌంటర్లు, విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో పూర్తిగా అవగాహన రాహిత్యం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణే అని మంత్రి సెటైర్లేశారు. అంతటితో ఆగని ఆయన.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే.. అప్పుడు స్పందించని పవన్ అవగాహన రాహిత్యంతో ఇప్పుడు మాట్లాడటం విడ్డూరమన్నారు. టీడీపీ హయాంలో వివేకా హత్య కేసు విచారణ ప్రారంభమైందన్న విషయం పవన్ గుర్తెట్టుకోవాలన్నారు.
మాకేంటి సంబంధం..!?
‘వివేకా కేసు విచారణలో జగన్.. అతనికి సంబంధించిన వ్యక్తుల పాత్ర ఉంటే అప్పుడే కేసు నమోదు చేసేవారు. తన తండ్రి (వివేకా కుమార్తె సునీత) హత్య కేసు విచారణపై వివేకా కుమార్తె, ఢిల్లీలో సీబీఐను ప్రశ్నిస్తే, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి?. వివేకా హత్య విచారణ కేసులో కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్, మా ప్రభుత్వం విచారణ చేయట్లేదని మాట్లాడడం అవగాహన రాహిత్యమే. వివేకా హత్య కేసులో సీబీఐ చేసే విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. రాజకీయాలను కూడా వ్యాపారంగా మార్చేసిన పవన్ కళ్యాణ్, ఎవరో రాసిచ్చిన డైలాగులు, స్క్రిప్టులు చదువుతున్నాడు’ అని కొడాలి కౌంటర్ల వర్షం కురిపించారు.
పవన్‌పై విమర్శలు.. కేంద్రానికి సవాల్..
‘పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌కు.. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు. దేవుళ్ల గుళ్ళపై అమిత ప్రేమ ఉందన్న బీజేపీ, అంతర్వేది రథ దగ్ధం కేసులో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా కేంద్రం ఎందుకు స్పందించలేదు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు చేసిన కేసుల్లో అనేక మందిని ఏపీ అరెస్టులు చేశారు. మత విద్వేషాలు ద్వారా లబ్ధి పొందేందుకు రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కుట్రలు చేస్తున్నాయి. దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం దుర్మార్గం. కేంద్రానికి ధైర్యం ఉంటే గుళ్ళపై జరిగిన దాడులపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలి’ అని కేంద్రానికే కొడాలి నాని ఒకింత సవాల్ విసిరారు.