ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని టీడీపీ సంచలన ప్రకటన చేసిన విషయం విదితమే. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఇలా ఎన్నికలకు దూరంగా ఉండటం ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం. దీనిపై అటు అధికార పార్టీ నుంచి.. ఇటు క్రిటిక్స్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు, కౌంటర్ ఎటాక్‌లు వస్తున్నాయి. బాబు ప్రకటన చేసిన మరుక్షణం నుంచే.. ఆయన మాటలను లెక్క చేయకపోవడం కాదు కదా.. కనీసం గౌరవం కూడా ఇవ్వకుండానే టీడీపీకి తమ్ముళ్లు వరుస ఝలక్ ఇవ్వడం షురూ చేశారు. మొదట జ్యోతుల నెహ్రుతో ప్రారంభమైన ఝలక్‌లు.. అటు గోదావరి జిల్లాల నుంచి ఇటు హిందూపురం వరకు వచ్చాయి.
వరుస ఎదురుదెబ్బలు..
చంద్రబాబు ప్రకటనతో తీవ్ర అసంతృప్తికి లోనైన కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసేసి మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటుండగా.. మరికొందరు మాత్రం చంద్రబాబు చెప్పినా సరే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, బరిలోకి దిగితీరుతామని ఎన్నికల ప్రచారం కూడా షురూ చేసేశారు. చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలంలోని తిరుమలయ్యపల్లె టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి టి.వనజ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి పోటీ నుంచి తప్పుకుంటున్నారు. అనంతరం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బండి గోవర్థన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మరోవైపు.. కృష్ణా జిల్లా నందివాడ మండల టీడీపీ జడ్పీటీసి అభ్యర్థిగా పోటీ చేసి గెలవాలని దాసరి మేరీ విజయ కుమారి అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే చంద్రబాబు చేసిన ప్రకటనతో కంగుతిన్న ఆమె.. ఆలస్యం చేయకుండా టీడీపీకి రాజీనామా చేసేసి.. మంత్రి కొడాలి నాని సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో గుడివాడలో అంతంత మాత్రమే ఉన్న టీడీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.
ఇటు జంపింగ్‌లు.. అటు పోటీ..!
ఇలా చెప్పుకుంటూ ఇటు రాయలసీమ, అటు కోస్తాంధ్రలో చాలా చోట్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థులు ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. మరోవైపు.. గుంటూరు, విజయవాడ, గోదావరి జిల్లాల్లో పలుచోట్ల టీడీపీ తరఫునే తాము బరిలోకి దిగుతున్నామని కొందరు.. ఇంకొందరు రెబల్స్‌గా మారి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటిస్తున్నారు. అయితే.. స్థానికంగా బలంగా ఉన్న చోట్ల పార్టీ తరఫున అభ్యర్థులు బరిలోకి దిగినా అభ్యంతరం చెప్పకూడదని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అధినేత చంద్రబాబు నిర్ణయంతో చాలా మంది తెలుగు తమ్ముళ్లు నొచ్చుకున్నా.. బయటికి చెప్పుకోలేకపోతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. జిల్లాలు, మండలాల వారీగా నేతల అభిప్రాయాలను తీసుకొని బాబు నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేదేమో..!