తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలో ఎన్నికల జోరు పెంచాయి. పోలింగ్‌కు కేవలం కేవలం ఐదు రోజులు మాత్రమే గడువు ఉండడంతో రాష్ట్ర, కేంద్ర స్థాయి ప్రముఖులు రంగంలోకి దిగి అభిమానులు, కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారు. మరోవైపు.. ముఖ్య నేతలను, రెబల్స్‌ను తమ పార్టీల్లోకి చేర్చుకోవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బీజేపీ సన్నాహాలు మొదలెట్టింది. అన్నాడీఎంకే-బీజేపీ కలిసి పోటీ చేస్తుండటంతో ఎలాగైనా సరే గెలిచి తీరాలని కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన భగీరథ ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీ పెట్టి తమిళనాట మార్పు తీసుకొస్తానని చెప్పి.. పార్టీ ఊసే లేకుండా మిన్నకుండిపోయిన సూపర్ స్టార్, అగ్రకథానాయకుడు రజనీకాంత్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. నిజంగా తలైవా కూడా బహుశా ఇలాంటి సమయంలో ఇలా గిఫ్ట్ ఇస్తారని ఊహించి ఉండరేమో.
అసలు విషయానికొస్తే.. రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. గురువారం నాడు తలైవాకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు ఇస్తున్నట్లు తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ టైమ్‌లో రజనీకి ఎలాంటి అవార్డు ఇవ్వలేదు..? అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడే.. అది కూడా ఎన్నికలకు ముందు అవార్డు ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటి..? అసలు దీనికి వెనుక అర్థం పరమార్థమేంటి..? అనేది అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది.
Happy to announce #Dadasaheb Phalke award for 2019 to one of the greatest actors in history of Indian cinema Rajnikant ji
His contribution as actor, producer and screenwriter has been iconic
I thank Jury @ashabhosle @SubhashGhai1 @Mohanlal@Shankar_Live #BiswajeetChatterjee pic.twitter.com/b17qv6D6BP
— Prakash Javadekar (@PrakashJavdekar) April 1, 2021
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని అభిమానులు ఊరించి.. ఆరోగ్య రీత్యా రాలేకపోతున్నానని ఉసూరుమనిపించేశారు. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఉంటే కచ్చితంగా బీజేపీకి మద్దతు ఇస్తారని చాలా రోజులుగా పుకార్లు షికార్లు కూడా చేశాయి. అంతేకాదు.. పరోక్షంగా, ప్రత్యక్షంగానూ రాష్ట్రంలోని కొందరు ప్రముఖులు, ముఖ్యంగా బీజేపీ నేతలు స్వయంగా మీడియా ముందుకు రజనీ మద్దతు తమకే.. ఆయన అభిమానులంతా తమ పార్టీవైపే ఉన్నారంటూ కూడా కీలక ప్రకటనలే చేశారు. ఇలాంటి తరుణంలో ఎవరూ ఊహించని విధంగా రజనీకి ఇలా అరుదైన గౌరవంతో కూడిన పురస్కారాన్ని ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంలో అంతరార్థమేంటో బీజేపీకి.. రజనీకాంత్‌కే ఎరుక. కాగా.. రజనీని ఇప్పటి వరకూ 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డులు వరించాయి. తాజాగా దాదాసాహెబ్ పాల్కే అవార్డుకు ఎంపికవ్వడంతో అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొనగా.. కొందరు విమర్శకులు, రాజకీయ విశ్లేషకులు తలైవాకు బీజేపీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. మరి రజనీకాంత్ మనసులో ఏముంది..? ఈ అవార్డుపై ఆయన ఎలా స్పందిస్తారు..? అవార్డు ఇచ్చినందుకుగాను ఆయన బీజేపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటిస్తారా..? లేదా అన్నది త్వరలో తేలనుంది.