జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతో జనసేన కలిసి పోటీ చేసి.. ముందుకెళ్లిన విషయం విదితమే. ఆ తర్వాత పవన్ బీజేపీతో చేతులు కలపడంతో.. ఆయనపై దుమ్మెత్తి పోసిన కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు స్వతంత్రంగా పోటీ చేస్తూ పార్టీ కార్యక్రమాలను సాగిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ఇటీవల పవన్ కల్యాణ్.. బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటు కేంద్రాన్ని కానీ.. ఇటు ఏపీలో ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీని కానీ పల్లెత్తి మాటే అనకుండా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై ఇదివరకు వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు పవన్‌పై కౌంటర్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా.. పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై సీపీఐ నారాయణ మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ ఓడిపోయిన భీమవరం వేదికగా ఇలా విమర్శలు గుప్పించారు. ‘పవన్ కళ్యాణ్ కొండపైన పాచిపోయిన లడ్డూలు తింటున్నాడు. పాచిపోయిన లడ్డూల కేంద్రం తిరుపతిలో కూర్చుని బీజేపీని సపోర్టు చేస్తున్నాడు. ఏముఖం పెట్టుకుని బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు. అప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు తియ్యగా.., కమ్మగా ఉన్నాయా..?
చంద్రబాబు ఎన్నికలు బహిష్కరించటం ఏమిటి?. ఎదుర్కోవాలి, పారిపోతే ఎట్లా కుదురుతుంది. పార్టీ కింద కేడర్, రాజకీయ పార్టీ , ఓట్లు ఏమవుతాయి..? రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి నలభై ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి భయపడి పారిపోతే ఎలా..? బతికుండి ఓటు వేయకపోతే చచ్చినట్లే లెక్క. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. 90 శాతం ఫలితాలు మాకే అనుకూలం అని వైసీపీ అంటున్నది. నామినేషన్లు వేయకుండా ఆపవలసిన పరిస్థితి మరి ఎందుకు వచ్చింది..? అధికారులను, పోలీసులను, రౌడీలను ఉపయోగించి ఎన్నికలను ఏకపక్షం చేసుకోవలసిన అవసరం ఏం వచ్చింది’ అని నారాయణ ప్రశ్నల వర్షం కురిపించారు.