చిత్రం: వకీల్‌సాబ్
వ్యవధి: 152 నిమిషాలు
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్
నటీనటులు: పవన్ కళ్యాణ్, శ్రుతిహాసన్, ప్రకాష్ రాజ్, నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, వంశీ కృష్ణ తదితరులు
సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్
సంగీతం: ఎస్.ఎస్. థమన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్
రచన, దర్శకత్వం: శ్రీరామ్ వేణు
పాలిటిక్స్‌లో బిజీ అయిన తర్వాత పవన్ తీసుకున్న డెసిషన్.. సినిమాలకు దూరంగా ఉండటం. ఈ నిర్ణయంతో అభిమానులు ఒకింత షాక్‌కి గురయ్యారు. కానీ ఆయన నిర్ణయం తీసుకున్నా.. అభిమానులు మాత్రం బలంగా కోరుకున్నారు.. ఆయన తిరిగి సినిమాలు చేయాలని. అభిమానుల ఆశలు ఫలించాయి. ఫలితంగా పవన్ కల్యాణ్ ఒకటి కాదు.. వరుసగా 5 సినిమాలకు సైన్ చేశారు. అందులో మొదటి చిత్రమైన ‘వకీల్ సాబ్’ నేడు (ఏప్రిల్ 9) థియేటర్లలోకి వచ్చింది. దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత పవన్ నటించిన చిత్రం కావడంతో.. ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో.. అదే స్థాయిలో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక రీఎంట్రీలో పవన్ కల్యాణ్ ఓ మెసేజ్ ఒరియంటెడ్ చిత్రం రీమేక్ చేయడం, వేణు శ్రీరామ్ వంటి దర్శకుడు దానిని హ్యాండిల్ చేయడం, దిల్ రాజు వంటి సక్సెస్ ఫుల్ నిర్మాత ఈ సినిమాను నిర్మించడం.. ఇలా అన్నీ ఈ సినిమాపై క్రేజ్ పెంచాయి. గత కొన్ని రోజులుగా మేకర్స్ సైడ్ నుంచి జరుగుతున్న హంగామా అయితే.. ఈ సినిమా మాములుగా ఉండదనేలా ప్రేక్షకులలోకి ‘వకీల్ సాబ్’ని తీసుకెళ్లింది. మరి ప్రేక్షకులు అంచనాలను ఈ ‘వకీల్ సాబ్’ అందుకున్నాడా? పవన్ రీ ఎంట్రీ ఎలా ఉంది? వంటి విషయాలు తెలుసుకుందాం పదండి.
వకీల్ సాబ్ -కథ
కథ గురించి చెప్పుకోవాలంటే.. ఈ చిత్రం ఇప్పటికే రెండు భాషల్లో వచ్చింది. చాలా మంది కథ మొత్తం తెలిసే ఉంటుంది. ముగ్గురు అమ్మాయిలు అనుకోకుండా ఓ కేసులో ఇరికించబడతారు. వారిపై కేసు పెట్టిన వారు చాలా బలవంతులు కావడంతో.. ఆ అమ్మాయిలకు వేరే దారిలోక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు సత్యదేవ్ అనే లాయర్ వారికి అండగా నిలబడి.. వారిపై ఉన్న కేసును వాదించి, వారిని బయటికి తీసుకువస్తాడు. సత్యదేవ్ ఎవరు?. ఆ అమ్మాయిలకు జరిగిన అన్యాయం ఏమిటి? సత్యదేవ్ ఆ అమ్మాయిలకు హెల్ప్ చేయడానికి కారణం ఏమిటి? ఎలా కేసును సత్యదేవ్ జయించాడు? వంటి అంశాలతో ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేలో దర్శకుడు వేణు శ్రీరామ్ రూపొందించిన చిత్రమే ఈ ‘వకీల్ సాబ్’.
వకీల్ సాబ్- ఆర్టిస్టుల పనితీరు
సత్యదేవ్ పాత్రలో పవన్ కల్యాన్ చేస్తున్నాడంటే.. సినిమా అంతా అతనిపైనే ఫోకస్ అయి ఉంటుందని అంతా అనుకుంటారు. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే.. ఆయనే ఎక్కువగా ఫోకస్ అవుతారు. కానీ ఈ సినిమాలో పవన్ తో పాటు కనిపించే ప్రతి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ అయితే కెరియర్‌లో బెస్ట్ పెర్ఫామెన్స్‌తో అలరించాడని చెప్పుకోవచ్చు. మూడు షేడ్స్‌లో కనిపించి పవన్ అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. పవన్ కల్యాణ్ స్ర్కీన్ మీద కనిపించిన ప్రతీసారి మెస్మరైజ్ చేశాడని చెప్పుకోవచ్చు. శృతిహాసన్ పాత్రకి నిడివి చాలా తక్కువ టైమే అయినా.. తన పాత్ర వరకు ఆమె న్యాయం చేసింది. అంజలి, నివేథా, అనన్య నాగళ్ల.. చక్కని నటనను ప్రదర్శించారు. ప్రకాష్ రాజ్ ఎప్పటిలానే చెలరేగిపోయాడు. ఇంకా ప్రతి ఒక్కరూ వాళ్ల పాత్రలకు పర్ఫెక్ట్‌గా న్యాయం చేశారు. ఆర్టిస్టుల విషయంలోనూ దర్శకుడు వేణు శ్రీరామ్.. జడ్జిమెంట్ బాగుందని చెప్పుకోవచ్చు.
వకీల్ సాబ్- సాంకేతిక నిపుణుల పనితీరు
ఈ సినిమాకి ఎస్. ఎస్. థమన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం అదుర్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేపథ్య సంగీతం విషయంలో వావ్ అని చెప్పొచ్చు. పి. ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ మరో మెయిన్ హైలెట్. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త క్రిస్ప్‌గా వ్యవహరించాల్సింది. ముఖ్యంగా ఫస్టాప్ ఇంకొన్ని నిమిషాలు ట్రిమ్ చేయవచ్చు. డైలాగ్స్ పొలిటికల్ పంచుల్లా పేలాయి. డైరెక్టర్ శ్రీరామ్ వేణు.. సినిమా తీసిన తీరుకు ప్రతి ఒక్కరూ హ్యాట్సాప్ చెబుతారు. నిర్మాణ విలువలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. పవన్‌తో సినిమా చేయడమే ధ్యేయం అని మొదటి నుంచి దిల్ రాజు తన డ్రీమ్ అని చెప్పుకుంటూ వచ్చినట్లే.. ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదని సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. ఓవరాల్‌గా ఎడిటింగ్ విషయంలో చిన్న లోపం తప్పితే.. మొత్తం సినిమా అంతా ఓ టీమ్ వర్క్‌గా సెట్ అయింది.
వకీల్ సాబ్ ట్యాగ్ లైన్: పుష్పరాజ్ చెప్పినట్టు.. తగ్గేదే.. లే
వకీల్ సాబ్ రేటింగ్: 3.5/5