దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్‌పై కూడా పడుతోంది. దీనివల్ల జట్ల ఫ్రాంఛైజీలకు భారీ సమస్యలు ఎదురవుతున్నాయి. ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్లకు దూరం అవుతుండడంతో ఆయా ఫ్రాంచైజీలు తలలు పట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా నేపథ్యంలో తాను జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు కేన్ రిచర్డ్సన్, ఆడం జంపా ఐపీఎల్ 14వ సీజన్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో తాము స్వదేశానికి వెళ్లిపోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం కూడా ధ్రువీకరించింది. వీరితో పాటు రాజస్థాన్ ఆటగాడు ఆండ్రూ టై కూడా ఐపీఎల్ నుంచి వెదొలుగుతున్నట్లు తెలిపాడు.
ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా ఫ్రాంచైజీలకు బైబై చెబుతుండడంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. తాజా పరిస్థితిపై స్పందించింది. లీగ్ నుంచి నిష్క్రమణలు ఉన్నా, ఐపీఎల్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ‘ఆటగాళ్లు వెళ్లిపోతున్నా.. ఐపీఎల్ లీగ్ మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. ఎవరైనా లీగ్ నుంచి తప్పుకోవాలనుకుంటే మంచిదే’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే మే 30వ తేదీ వరకూ ఐపీఎల్ కొనసాగనున్న విషయం తెలిసిందే. అప్పటివరకు మిగతా దేశాల క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లను భారత్‌లో ఉండేందుకు అనుమతిస్తాయా..? లేక వెనక్కి వచ్చేయమంటాయా..? అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా అక్కడి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐపీఎల్లో ఆడుతున్న ఆటగాళ్లందరినీ వెనక్కి వచ్చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా సమాచారం లేదు. అయితే సీఏ మాత్రం ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలియజేసినట్లు సమాచారం. భారత్ నుంచి వచ్చే సమాచారాన్ని ఆస్ట్రేలియన్ ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు వెల్లడించాయి. ప్రస్తుతం 14 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్ ఉన్నారని, వారి గురించి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆసీస్ ఆటగాళ్లను నిజంగా సీఏ వెనక్కి వచ్చేయమంటే అప్పుడు పరిస్థితేంటనేది ప్రశ్నార్థకంగా మారింది.